మేడ్చల్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కీసర గ్రామ అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ రూ.6 కోట్లు మంజూరు చేశారు. శనివారం ప్రగతిభవన్‌లో కీసర సర్పంచ్ మాధురి వెంకటేశ్‌కు నిధులకు సంబంధించిన ఆదేశాల ప్రతిని అందజేశారు. సర్పంచ్ వెంట టీఆర్ఎస్ నేత కన్నెబోయిన రమేశ్ తదితరులు కూడా ఉన్నారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకోవటమే కాకుండా ప్రగతిభవన్‌కు పిలిచి నిధుల మంజూరు ఆర్డర్‌ను ఇవ్వటం తమ పూర్వజన్మ సుకృతమని సర్పంచ్ మాధురి వెంకటేశ్ ఆనందం వ్యక్తంచేశారు. 2019లో కీసర అడవిని దత్తత తీసుకున్న సంతోష్‌కుమార్, ఆ ఫారెస్టు అభివృద్ధికి ఇప్పటికే రూ.3కోట్ల వరకు నిధులు ఇచ్చారు. ఈ నెల 6న కీసర గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామస్తులు రూ.27 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆయనకు నివేదించారు. దాంతో గ్రామాభివృద్ధికి తొలివిడతగా రూ.6 కోట్ల నిధుల మంజూరు చేశారు.