సంగారెడ్డి మే 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 5జీ సేవలపై జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలిచ్చాయి. 5జీ కోసం తాము అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ మాసివ్ మల్టీపుల్ ఇన్పుట్-మల్టీపుల్ ఔట్పుట్ (MIMO-మిమో)ను విజయవంతంగా పరీక్షించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. 5జీ టెక్నాలజీ వినియోగంలోకి తేవడానికి, 6జీ పరిశోధనలకు మిమో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఇందుకు సంబంధించిన లోగోను మంగళవారం విడుదలచేశారు. సొంతంగా 5జీ టెక్నాలజీ అభివృద్ధికి కొంతకాలంగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు జరుపుతున్నది. 5జీ టెక్నాలజీలో అంతర్భాగమైన మిమో, సెల్యులార్ నెట్వర్క్ కవరేజీ, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
ఐఐటీ హైదరాబాద్ 192 యాంటెన్నాలు, 48 రేడియో ప్రీక్వెన్సీలను ఉపయోగించి ఒకే స్ప్రెక్టమ్లో 24 నుంచి 36 మంది సెల్ఫోన్ వినియోగదారులకు 5జీ సేవలు అందించవచ్చని పరీక్షించి చూపించారు. 5జీలో ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన మిమోతో సెల్ఫోన్ వినియోగదారులు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో అవాంతరాలు లేకుండా ఫోన్ సంభాషణలతోపాటు నాణ్యమైన వీడియోలు చూడవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేగంగా వైర్లెస్ ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. జీ మిమో పరీక్ష విజయవంతం కావడంపై బీఎస్ మూర్తి హర్షం వ్యక్తం చేశారు.
5జీ పరిశోధనలు చేస్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఐటీ హైదరాబాద్ పరిశోధనల విభాగం డీన్ ప్రొఫెసర్ కిరణ్ కూచి, 5జీ పరిశోధనల విభాగం అధిపతి ప్రొఫెసర్ సాయి ధీరజ్ మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ 5జీ అభివృద్ధి చేయడంలో వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే దేశీయ సెల్ఫోన్ వినియోగదారులకు నాణ్యమైన 5జీ సేవలు అందుబాటులోకి రావటానికి తమ పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్పారు. టెలీ కమ్యూనికేషన్శాఖ సెక్రటరీ కే రాజారామన్ మాట్లాడుతూ.. 5జీ, 6జీ వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం గణనీయమైన కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.