Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాల వల్ల 32 జిల్లాల్లో 587 రహదారులకు భారీగా నష్టం జరిగింది. ఒక వంతెన సహా 82రోడ్లు వరదలకు కొట్టుకుపోయాయి. 111బ్రిడ్జీలు, కల్వర్టులకు తీవ్ర నష్టం జరిగింది. తక్షణ మరమ్మతులకు రూ. 256 కోట్లు, శాశ్వత మరమ్మతులకోసం రూ.1,200 కోట్లు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది.
ఖమ్మంలో అత్యధికంగా 148 రోడ్లకు నష్టం జరగ్గా, 145 ప్రాంతాల్లో రోడ్లు ముంపునకు గురయ్యాయి. 26 చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. కొత్తగూడెంలో 26 కల్వర్టులు, బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా కొరివిలో ఆకేరుపై నిర్మించిన బ్రిడ్జీ పూర్తిగా కొట్టుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా.