మహదేవపూర్, జూన్ 26 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు స్వల్పంగా వరద వస్తున్నది. గురువారం 5,400 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతేమొత్తంలో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బరాజ్‌లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉన్నదని వెల్లడించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
కన్నాయిగూడెం: ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరిలోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. గురువారం ఎగువ నుంచి 8000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో నీటిమట్టం పెరుగుతున్నది. నీటిమట్టం 76.80 మీటర్ల ఎత్తుకు చేరుకోగా, ఒక గేటు ఎత్తి 3800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 2 మోటర్లను ఆన్‌చేసి రోజుకు 494 క్యూసెక్కుల నీటిని భీంఘనపురం రిజర్వాయర్‌లోకి పంప్ చేస్తున్నారు.