Manthani | మంథని రూరల్: మంథని నియోజకవర్గంలోని అటవీ ప్రాంతం మండలాలతో అనుసంధానం చేసిన దశాబ్దాల చరిత్ర గల అడవి సోమనపల్లి మానేరు వంతెనకు ఎట్టకేలకు మరమ్మత్తులు ప్రారంభం అయ్యాయి. ఇటు పెద్దపల్లి జిల్లా అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను, ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన వారధి శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనంతో కళ్ళకు అద్దింది. మంథని మండలం అడవి సోమన్‌పల్లి మానేరు నదిపై 1971లో స్ప్రింగ్ బ్రిడ్జిని అప్పటి మంథని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ప్రారంభించారు. అనంతరం 54 ఏళ్లుగా ఈ బ్రిడ్జి ప్రజలకు వాహనదారులకు సేవలు అందించింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు ఓవర్ లోడ్ వలన బ్రిడ్జి లింక్స్ వద్ద పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదంలో పీవీ బ్రిడ్జి అనే శీర్షికన మార్చి 17న నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం ప్రచురితం చేసింది.
ఈ కథనానికి స్పందించిన అధికారులు ఎట్టకేలకు వంతెన మరమ్మతులకు రూ. 40 లక్షలు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపై మంథని కాటారం మహాదేవపూర్ భూపాల్పల్లి, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన బ్రిడ్జిని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. నమస్తే తెలంగాణ కథనంతో కదలిక వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాహన చోదకులు ప్రజలు నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.