హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ) : రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, వర్క్‌షాప్‌ల ఏర్పాటు సహా ఇతర అభివృద్ధి పనులకు రూ.41,667 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. తెలంగాణలో రైల్వే లైన్లను 100% విద్యుదీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, వాటి సంఖ్య మరింత పెంచుతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో 1,465 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సికింద్రాబాద్‌లో కవచ్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. బడ్జెట్లో ఏపీకి రూ.9,417 కోట్లు మంజూరు చేశామని, వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆ రాష్ట్రంలో రూ.84,559 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్టు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలో 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.