హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్లకు పెంచాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలలో ఓబీసీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాజకీయాల్లో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఆ వర్గాలకు తగు న్యాయం చేసేందుకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత రాకేశ్, శివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.