Cycber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 576 సైబర్‌నేరాలతో సంబంధమున్న 52 మంది నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి రూ.43 లక్షల నగదు, రూ.40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని, మరో రూ.2.87 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా నిందితులకు 74 కేసులతో, హైదరాబాద్‌లో 33 కేసులతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులలో బాధితులు రూ.88.32 కోట్లు నష్టపోయినట్టు సీపీ వివరించారు. నిందితుల నుంచి 43 మొబైల్ ఫోన్లు, 39 ఏటీఎం కార్డులు, 17 పాస్‌బుక్స్, 54 చెక్బుక్స్తో పాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిగా జరిగిన సైబర్‌నేరాల్లో బాధితులు రూ.3500 కోట్లు మోసపోయారని చెప్పారు.
కొందరు బ్యాంకు అధికారులు సైబర్‌నేరగాళ్లతో చేతులు కలిపి, నకిలీ ధృవపత్రాలతో ఖాతాలు తెరుస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆర్బీఐ, బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. చదువుకున్న వాళ్లే ఎక్కువగా బాధితులవుతున్నారని, కొందరు ఆశకు పోయి ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్‌ల భయంతో మోసపోతున్నారని చెప్పారు. అవగాహనతోనే సైబర్నేరాలను కట్టడి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సైబర్నేరాలలో రికవరీ 14 శాతం మాత్రమే ఉంటుందని, మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సైబర్‌క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, హైదరాబాద్‌లో సైబర్‌నేరగాళ్ల కోసం భారీ అపరేషన్ చేపట్టి, 52 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతీ పాల్గొన్నారు, ఈ అపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని సీపీ అభినందిస్తూ రివార్డులు అందించారు.