హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కలెక్టరేట్/నల్లగొండ : రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 51 మంది నామినేషన్లు వేయగా, ఇదే నియోజకవర్గం ఉపాధ్యాయ స్థానానికి 8 మంది నామినేషన్లు దాఖలుచేశారు. మొత్తం గ్రాడ్యుయేట్ స్థానానికి 100, టీచర్స్ స్థానానికి 17 నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ నియోజకవర్గం నుంచి చివరి రోజు 18 నామినేషన్లతో కలిపి మొత్తం 23 నామినేషన్లు వచ్చినట్టు రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి వెల్లడించారు. మూడు స్థానాలకు కలిపి మొత్తం 140 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, అదేరోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలనున్నది. 27న పోలింగ్ జరుగనున్నది. కాగా, నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు కాగా వందలాది మంది అనుచరులతో తరలివచ్చి అభ్యర్థులు నామినేషన్ల వేశారు.
నామినేషన్ల చివరిరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పట్టభద్రుల అభ్య ర్థి వీ నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి మంత్రులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అదే సమయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేసి వెనుదిరిగారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం దాటుతుండగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వాహనంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డు చెప్పారు. అక్కడే ఉన్న రవీందర్‌సింగ్ జోక్యం చేసుకుని తమ వాహనాలు అనుమతించకుండా, మంత్రుల వాహనాలు ఎలా అనుమతించారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, రవీందర్‌సింగ్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.