Khammam | ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకేరోజు 50 వేల గజాలను రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్ఆర్ఎస్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతోపాటు దాదాపు 10 పాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో జరిగిన ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ఓ మంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ సైతం విచారణకు ఆదేశించింది. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం, తనికెళ్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు ఉండగా.. వీటిలో మండల పరిధిలోని ‘ఇండో ఖతర్’ పేరుతో కొన్నేండ్ల క్రితం పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. పదేండ్ల క్రితం జీపీఏ తీసుకున్న ఓ వ్యక్తి ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి అనుచరుడిగా పేరొందాడు. అతడు ‘ఇండో ఖతర్’ వెంచర్‌లోని కొంత భాగాన్ని డెవలప్మెంట్ పేరుతో భూ యజమానుల నుంచి జీపీఏ పొందాడు.
అయితే డెవలపర్‌కు, భూ యజమానులకు మధ్య వివాదం తలెత్తడంతో డెవలపర్‌కు ఇచ్చిన జీపీఏను రద్దు చేయకుండానే ఆ భూమికి సంబంధించిన వారు మరో కీలక మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ రిజిస్ట్రేషన్ అధికారులతో తమ పనిని గుట్టుగా చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వెంచర్‌కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్లు చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50 వేల గజాలను సదరు జీపీఏ రద్దు కాకుండానే రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. 50 వేల చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు పెద్దగా చెప్పుకున్నారే తప్ప నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును పట్టించుకోలేదు. రిజిస్ట్రేషన్ అయిన భూములకు ఎల్ఆర్ఎస్ లేకపోయినా.. లేఅవుట్ ఉందన్న కారణంతో అన్నింటికీ కలిపి రిజిస్ట్రేషన్ చేయడం అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమన్న భావన వ్యక్తమవుతున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య ఈ నెల 9వ తేదీ నుంచి సెలవుపై వెళ్లాడు. నిబంధనల ప్రకారం ఆ రోజు వచ్చిన మొత్తం డాక్యుమెంట్లను ఎంత రాత్రయినా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నదని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను పిలిపించి రిజిస్ట్రేషన్లు చేయడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకున్నారు. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. జీపీఏ పొందిన వ్యక్తికి తెలియకుండా ఈ తతంగం చేసిన వారిలో ఖమ్మం, మధిరకు చెందిన రియల్టర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.