మర్కూక్, మే 19: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదివారం బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మరాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో రైతుల కల్లాల వద్దకు వెళ్లి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని,క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించామని, కొన్న ధాన్యానికి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేశామని గుర్తుచేశారు. మండలంలో దాదాపు 50 లారీల ధాన్యం రోడ్లపైన ఉందని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి వేగంగా ధాన్యం సేకరణ పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణయాదవ్, మేకల కనకయ్య, అచ్చంగారి భాస్కర్, సంతోష్‌రెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.