సూర్యాపేట, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద పదిహేను రోజుల క్రితం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండిపడడంతో 500 ఎకరాల్లో వరి పంట మునిగింది. ఇప్పటికీ గండి పూడ్చకపోవడంతో నీటి విడుదలలేని కారణంగా సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మరో 30 వేల ఎకరాల్లో వరి పంట ఎండుతున్నది. ఎండాకాలం ఖమ్మం జిల్లాకు నీటిని తరలించేందుకు ఆ జిల్లా మంత్రులు చేసిన దుశ్చర్య కారణంగానే కాగితరామచంద్రాపురం వద్ద గండిపడింది. వారంలో గండి పూడుస్తామని జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినా ఆచరణకు నోచలేదు. దాంతో నాటుపడ్డ వరి పైర్లు ఎండి నేల నెర్రెలు వారుతున్నది.
తర్వాత నీటిని విడుదల చేసినా పొలాలకు నీరు చేరాలంటే ఇంకో పదిహేను రోజులు పడుతుంది. అప్పటివరకు మరో 20 వేల ఎకరాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఖమ్మం జిల్లా మంత్రులు షట్టర్లు వెల్డింగ్ చేసి నీటిని తరలించుకుపోతే నోరు మెదపకపోవడంతో కాలువ గండి పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కండ్ల ఎదుటే వరి పంట ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసమర్థత శాపంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ లెవల్లోనూ పంటలకు నీళ్లిచ్చి రైతులను ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాసంగి సీజన్లో ఒక్క తడికి నీళ్లను ఇవ్వాలని రైతులు గగ్గోలు పెట్టినా ఇవ్వకపోవడంతో దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట ఎండింది. అదే సమయంలో ఖమ్మం జిల్లాకు సాగు, తాగు నీటి కోసం ఆ జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూర్యాపేట జిల్లాలోని కాల్వల ద్వారా నీటిని తరలించుకుపోయారు.
ఎక్కడైనా రైతులు తూములు ఎత్తి పంటలను కాపాడుకుంటారేమోనని ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లను తెరువరాకుండా వెల్డింగ్ చేసి మరీ నీటిని తీసుకుపోయారు. జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి దానిపై కనీసం నోరు మెదపలేదు. మరోపక్క వెల్డింగ్‌లు తొలగించకుండానే వానకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేయడంతో ఇటీవల భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ కాల్వకు గండి పడి దాదాపు 500 ఎకరాల్లో పంట నీటి మునిగింది. ఇప్పుడు దాదాపు 30 వేల ఎకరాల్లో వరి పంట ప్రశ్నార్థకంగా మారింది.
కాగితరామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండి పడడంతో ఎగువన నాగార్జునసాగర్ ఎడమకాల్వపై తడకమళ్ల, పొనుగోడు రిజర్వాయర్, మునగాల వద్ద షట్టర్లను క్లోజ్ చేసి నీటి ప్రవాహాన్ని తగ్గించారు. గండి పడే కంటే ముందు సాగర్ మెయిన్ కెనాల్లో 9వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగా గండి ప్రభావంతో ప్రస్తుతం 4వేలకు తక్కువే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. గండి కారణంగా కోదాడ, నడిగూడెం, అనంతగిరి, మునగాల మండలాల్లో దాదాపు పూర్తిగా నీళ్లు రావడం లేదు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, పెన్‌పహాడ్ మండలాలకు కొంతమేర అందుతున్నాయి.
పదిహేను రోజులుగా నీటి ప్రవాహం తగ్గడంతో ఆయా మండలాల్లో ఇప్పటికే దాదాపు 30వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నట్టు తెలుస్తున్నది. మరో వారం రోజుల్లో గండి పూడుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం చెప్పారు. గండి పూడ్చిన తరువాత నీటిని విడుదల చేసినా ప్రస్తుతం ఎండిపోయి నెర్రెలు బారి ఉన్నందున పంట పొలాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరాలంటే మరో పదిహేను రోజులు పడుతుందని రైతులు వాపోతున్నారు. నీళ్లు వచ్చే సమయానికి మరో 20 వేల ఎకరాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేగాక ఎండుదశలో ఉన్న పొలాలకు నీళ్లు వచ్చినా వరితోపాటు కలుపు విపరీతంగా పెరిగి అదే స్థాయిలో ఎరువులు వాడకం ఉంటుందని, దిగుబడి కూడా భారీగా పడిపోతుందని వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
సాగర్ ఎడమ కాల్వ కింద 20 ఎకరాల్లో వరి సాగు చేశాను. కాగితరామచంద్రాపురం వద్ద పడ్డ గండితో నీళ్లు బంద్ పెట్టారు. పొలాలకు నీళ్లు లేక నెర్రెలు వారి ఎండిపోతున్నాయి. ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసి పంటలను కాపాడాలి.
– గునుగుంట్ల నరేశ్, రైతు, నడిగూడెం