హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి(జీసీ)లింక్ ప్రాజెక్టులో భాగంగా మళ్లించే 148టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 50శాతం అంటే 74 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెలప్మెంట్ అథారిటీ(ఎన్‌డబ్ల్యూడీఏ)కు బుధవారం తేల్చిచెప్పింది. ఢిల్లీ నుంచి ఎన్‌డబ్ల్యూడీఏ జనరల్ బోర్డు మీటింగ్ వర్చువల్ మోడల్లో కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. జీసీ లింక్ ప్రాజెక్టుపై ఆగస్టు 22న అన్నిరాష్ర్టాలతో నిర్వహించిన 6వ కన్సల్టేషన్ సమావేశంలో వెల్లడించిన అభిప్రాయాలనే మరోసారి తెలంగాణ పునరుద్ఘాటించింది. సమావేశంలో ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, హైడ్రాలజీ ఎస్ఈ వెంకటరమణ, అంతర్రాష్ట్ర విభాగం ఇన్చార్జి ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్ పాల్గొన్నారు.