Govt Colleges | హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): కొంత కాలంగా రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఇంటర్ విద్యపై రేవంత్ సర్కారు దృష్టిసారించకపోవడం, సర్కారు కాలేజీలను బలోపేతంచేసే దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాలేజీలు క్రమంగా కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలో 423 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే వీటిలో ఫస్టియర్ సీట్ల సంఖ్య 1.75లక్షల పైమాటే.
ఈ ఏడాది ఇప్పటివరకు 80వేల సీట్లు మాత్రమే నిండాయి. మొత్తం సీట్లల్లో భర్తీ అయ్యింది 50శాతంలోపే. మరో 50శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. గతంలో ప్రవేశాల సంఖ్య లక్షకు చేరగా, క్రమంగా 80వేలకు చేరింది. గురుకులాల్లో సీట్లు పొందిన వారికి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే మరో 10వేల అడ్మిషన్లు పడిపోతాయి. అంటే స్థూలంగా ఇప్పటి వరకు చేరింది 70వేలే అన్నమాట.
ఈ నెల 20తో ఇంటర్ అడ్మిషన్ల గడువు ముగియనుంది. సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడం గగనంగానే కనిపిస్తుంది. కాలేజీల్లో వసతుల లేమి, అధ్యాపకుల కొరత, బోధనేతర సిబ్బంది సమస్య పీడిస్తున్నది. కాలేజీలపై దృష్టిసారించేనాథుడే కరవయ్యారు. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల ఆగడాలు మితిమీరుతున్నాయి.
ఇష్టారీతిన కాలేజీలను పెంచడంతో పాటు అడ్డగోలు ఫీజులు గుంజుతున్నా సర్కారు అడ్డుకట్టవేయలేకపోతున్నది. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డియే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పరీక్షలకు ముందు ఒకసారి సమీక్షను నిర్వహించి మమ అనిపించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఒక్కసారి కూడా ఇంటర్ విద్యపై ప్రభుత్వం సమీక్షించలేదు. అధికారులకు దిశానిర్ధేశనం చేయలేదు.