హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు తప్పు చేస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అదే ఇంజినీర్లు తప్పుచేస్తే వందల మంది జీవితాలు ప్రశ్నార్థకం. ఇలాంటి ఇంజినీర్లను తయారుచేసే బీటెక్ సీట్లను ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అంగట్లో అమ్మినట్టు అమ్ముతున్నారు. దశాబ్దాలుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న ఆ రాష్ట్రంలో బీటెక్‌లో 50 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటావే. దీంతో ఆ సీట్లను కాలేజీ యాజమాన్యాలు ఇష్టారీతిన అమ్మేసుకొంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ కూడా బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్లను 50 శాతానికి పెంచేశారు. గుజరాత్లో 171 ఇంజినీరింగ్ కాలేజీల్లో 51,482 సీట్లున్నాయి. వీటిలో 50 శాతం సీట్లు అంటే 25 వేల సీట్లను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బేరానికి పెట్టింది. ప్రభుత్వమే ఈ కోటాను పెంచి దందాకు అవకాశం కల్పించింది.
గుజరాత్ మాడల్ ఇదే
మాటిమాటికీ బీజేపీ నేతలు గుజరాత్ మాడల్ అని వల్లిస్తుంటారు. డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ ఘోషిస్తుంటారు. ఇలా సీట్లను బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే వీలు కల్పించటమే గుజరాత్ మాడలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్ మినహా ఏ రాష్ట్రంలోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు ఈ స్థాయిలో లేవు. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్లు 30 శాతమే. అది కూడా ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిందే. తెలంగాణ వచ్చాక అదే కోటా కొనసాగుతున్నది.