స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నిజాంసాగర్, జూలై 24 : కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కూడా స్థిరీకరణలో భాగమేనన్నారు. ఆదివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి మంజీరా నదికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీటి విడుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు, వరదలతో మంజీర నదిలోకి భారీగా నీటి ప్రవహం వస్తుందని, జూలై నెలలో నిజాంసాగర్ నీటి విడుదల చేయడం చాలా అరుదు అన్నారు.
అనంతరం నిజాంసాగర్, బాన్సువాడ నాయకులతోపాటు పర్యాటకులతో కొద్దిసేపు సరదాగా గడిపి సెల్ఫీలు దిగారు. జూలై నెలలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటితో నిండటం వల్ల రెండు పంటలకు సాగు నీటికి ఇబ్బందులు ఉండవన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మరో మార్గం మల్లన్నసాగర్, కొండెం చెరువు ద్వారా సైతం నీరు తీసుకొచ్చే విధంగా పనులు మమ్మరంగా సాగుతున్నాయన్నారు.