Medical Scam | మందుగోళీ.. వాటాలకేళి.. వైద్యశాఖలో వెలుగులోకి 150 కోట్ల కుంభకోణం!
Medical Scam | వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Medical Scam | కమీషన్లు భారీగా వస్తున్నాయన్న ఆశతో.. అవసరం లేకున్నా కొందరు అధికారులు ఇబ్బడిముబ్బడిగా మందులు కొనుగోలు చేశారు. ఎంతలా అంటే, వాటి నిల్వ చేయడానికి గోడౌన్లూ సరిపోవట్లేదు. తీరా అవి కాలం చెల్లుతుం డటంతో వాటి ధ్వంసానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించి ఓ సంస్థకు కాంట్రాక్టునూ ఇచ్చారు. మొత్తంగా ఖజానాకు రూ.150 కోట్ల మేర గండిపడేలా.. వైద్యశాఖలో వాటాల కేళి ప్రకంపనలు సృష్టిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సప్లయర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఇండెంట్లు సృష్టించి అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రజారోగ్యాన్ని విస్మరించి, ఉద్యోగ ధర్మాన్ని మరచిపోయి అధికారులు చేసిన నిర్వాకంతో ప్రభుత్వ ఖజానాకు అక్షరాలా రూ.150 కోట్ల వరకు గండిపడినట్టు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన మందులు సరఫరా అవుతాయి. ఆయా దవాఖానల అవసరాలను బట్టి ఈ శాఖలు ఇండెంట్లు పెడుతాయి.
రాష్ట్రంలోని పెద్ద దవాఖానలు నేరుగా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)కి ఇండెంట్లు పెట్టుకునే వీలు కూడా ఉంది. అలా దవాఖానల నుంచి ఇండెంట్లు వచ్చిన తర్వాతే టీజీఎంఎస్ఐడీసీ అధికారులు మందులను కొనుగోలు చేస్తారు. ఇండెంట్ పెట్టిన దవాఖాన.. ఆ మందులను సెంట్రల్ మెడికల్ స్టోర్ల (సీఎంఎస్) నుంచి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మందులు సీఎంఎస్‌లలో మిగిలిపోయినట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పుడూ లేనివిధంగా టన్నుల కొద్దీ కాలం చెల్లిన మందులు సీఎంఎస్‌లలో పేరుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒరిజినల్ ఇండెంట్ల ఆధారంగా మందులు కొనుగోలు చేసి ఉంటే.. అరకొర మందులే మిగిలి ఉండేవని, కానీ ఏదో గోల్మాల్ జరిగితే గానీ, ఇంతలా మందులు పేరుకుపోవని కొందరు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఎంఎస్‌లలో రూ.150 కోట్లు విలువజేసే సుమారు 200 ట్రక్కుల కాలం చెల్లిన (ఎక్స్పైరీ) మందులు ఉండటంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఫేక్ ఇండెంట్ల స్కామ్ బయటపడినట్టు తెలుస్తున్నది.
కొత్త మందులకు జాగ లేదు
జీవో నంబర్ 140 ప్రకారం.. టీజీఎంఎస్ఐడీసీ సంస్థ ‘ఈ-ఔషధి’ వెబ్సైట్ ద్వారానే మందులు కొనుగోలు చేయాలి. మందుల కొనుగోలుకు ఇండెంట్లు తప్పనిసరి. అయితే టీజీఎంఎస్ఐడీసీలోని కీలక అధికారి ఒకరు మరికొంత మందితో సిండికేట్‌గా ఏర్పడి పెద్దఎత్తున మందులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం సదరు అధికారులు భారీగా ఫేక్ ఇండెంట్లు సృష్టించారని, మరికొన్ని మందుల కొనుగోలుకు అసలు ఇండెంట్లనే వాడలేదని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీఎంఎస్‌లలో భారీగా మందులు ఎక్స్పైరీ అయినట్టు తెలిసింది. ఎక్స్పైరీ మం దుల నిల్వలు సీఎంఎస్‌లలో భారీగా పేరుకొనిపోవడంతో కొత్త మందులు పెట్టేందుకు స్థలం లేకుండా పోయినట్టు సమాచారం. మందుల సరఫరా కంపెనీలతో అధికారులు కుమ్మక్కై అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు అర్థమవుతున్నది.
చక్రం తిప్పిన కీలక అధికారి
టీజీఎంఎస్‌ఐడీసీలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి కమీషన్లకు కక్కుర్తిపడి ఫేక్ ఇండెంట్లకు తెరతీసినట్టు సమాచారం. సదరు అధికారి కొన్నేండ్లుగా అదే సీటులో పాతుకుపోయి ఉన్నట్టు చెప్తున్నారు. తన సీటును పదిలం చేసుకోవడానికి, ఈ స్కామ్‌ను ముందుకు తీసుకొనిపోవడానికి ఆ కీలక అధికారికి మరికొందరు సాయం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా డ్రగ్స్ విభాగంలో పనిచేసిన మాజీ కీలక అధికారి, డయాగ్నొస్టిక్స్‌లో ఓ ఉన్నతాధికారి, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ ఫార్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఫార్మాసిస్ట్ ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్టు చెప్తున్నా రు. టీజీఎంఎస్ఐడీసీలోని కీలక విభాగాధిపతులు ఈ స్కామ్‌పై ప్రశ్నించకుండా ఉండేందుకు కూడా ఆ కీలక అధికారి అన్ని చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
డిస్పోజల్‌కు కాంట్రాక్ట్ కంపెనీ
కాలంచెల్లిన మందులను డిస్పోజ్ (ధ్వంసం) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలిసింది. సదరు సంస్థ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీగా పనిచేస్తున్నది. సీఎంఎస్‌లలో మిగిలిపోయిన బయో మెడికల్ వేస్టేజ్‌ను డిస్పోజ్ చేయడమే ఆ కంపెనీ పని. కాలంచెల్లిన మందులను సదరు కంపెనీ ప్లాంట్‌కు తరలించేందుకు ట్రక్కుల చార్జీలు, కంపెనీ కాంట్రాక్టు కలిపి మొత్తంగా రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం కుంభకోణంపై పలువురు హెల్త్ సెక్రటరీ, యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ) డీజీ, విజిలెన్స్ డీజీకి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీనిని మంత్రిత్వ శాఖలోని పై అధికారులు గుర్తించలేదా?అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కమీషన్ల కోసం కక్కుర్తి ఇలా
- క్యాన్సర్ చికిత్సలో వాడే ‘రిటుక్సిమాబ్ వయల్స్’ ఏడాదికి 200 వరకు అవసరముంటాయి. అయితే, కమీషన్ల కో సం వాటిని అనేకసార్లు వందల్లో కొనుగోలు చేసినట్టు సమాచారం.
- హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గించే ‘టికగ్రిలొర్ ట్యాబ్లెట్’లను ఇండెంట్ లేకుండానే 5 కోట్ల వరకు మందులను కొనుగోలు చేసినట్టు తెలిసింది.
- షుగర్ వ్యాధిగ్రస్తులకు వాడే ఇన్సులిన్ 70:30 నిష్పత్తిలో కొనాల్సిఉండగా 50:50 నిష్పత్తిలో ఇండెంట్ లేకుండానే రూ.5 కోట్ల ఇన్సులిన్ కొనుగోలు చేసినట్టు తెలిసింది.
- సర్కార్ దవాఖానల్లో పరీక్షలు చేసే యంత్రాల్లో వినియోగించే రసాయనాలు (రీఎజెంట్స్)ను సైతం 100% నుంచి 200% అధిక ధరలకు కొనుగోలు చేసినట్టు తెలిసింది.
- ప్రభుత్వం ఇటీవల చేపట్టిన తాజా టెండర్లలో రీఏజెంట్స్ ధర 100% నుంచి 200% తక్కువకే వచ్చినట్టు సమాచారం. ఇంత ఎక్కువ వెచ్చించి రీఏజెంట్స్ కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏంటీ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

