మల్హర్, ఆగస్టు 20 : యూరియా బస్తాల కోసం ఓ వైపు రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తుంటే.. చీకటి పడ్డాక.. దొంగ చాటున 50 బస్తాలను మాయం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మంగళవారం 444 బస్తాల యూరియా లోడ్ వచ్చింది. కొండంపేట, మల్లారం, పెద్దతూండ్ల, తాడిచెర్ల గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి పరుగులు తీయడంతో మరుసటి రోజు యూరియా బస్తాల పంపిణీ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. కొండంపేట రైతులు తాము దూర ప్రాంతం నుంచి ఆటోలో వచ్చామని, ఇప్పుడు వెళ్లి మళ్లీ రేపు రమ్మనడం ఏమిటని నిలదీయడంతో అప్పటికప్పుడు 45 యూరియా బస్తాలను 15 మంది రైతులకు పంపిణీ చేశారు.
మిగతా రైతులు వెళ్లిపోయారు. దీంతో ఇంటి దొంగలు రంగప్రవేశం చేశారు. చీకటి పడ్డాక.. కార్యాలయం తాళాలు తెరిచి 50 బస్తాల యూరియాను తమ అనుచరగణానికి తరలించారు. బుధవారం ఉదయం రైతులు యూరియా బస్తాలు తీసుకునేందుకు రాగా అక్కడ 350 బస్తాలు మాత్రమే ఉండడంతో 50 బస్తాలు ఎలా మాయమవుతాయని ప్రశ్నించారు. సిబ్బంది నీళ్లు నమలడంతో రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఇలాకాలోనే దొడ్డిదారిన యూరియా బస్తాలను తమ బంధుగణాలకు తరలించడం సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.