హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు (వైఐఆర్ఎస్) నిర్మిస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి నిధులు సమకూర్చేందుకు ఆపసోపాలు పడుతున్నది. అప్పు తెచ్చి ఈ గురుకులాలను నిర్మించేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తలుపు తట్టింది. రాష్ట్రంలో 79 గురుకులాలను నిర్మించాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం.. వీటి కోసం రూ.8 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రయత్నిచింది. కానీ, ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో రూ.5 వేలకోట్ల అప్పు కోసం దరఖాస్తు సమర్పించింది. ప్రస్తుతం అందులో రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చేందుకు ఏబీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే నిధులు చాలా స్వల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,020 కోట్లు అవసరం కాగా.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులోనూ ఖర్చు చేసింది కేవలం రూ.6 కోట్లేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక్కో గురుకులాన్ని రూ.200 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, ఇందులో పన్నులు, సెస్సులు తదితరాలకే రూ.50 కోట్లు పోనున్నాయి. అంటే ఒక్కో గురుకులం నిర్మాణానికి స్థూలంగా వెచ్చించేది రూ.150 కోట్లే. ప్రస్తుతం మధిర, కొడంగల్, కొల్లాపూర్, హుస్నాబాద్, షాద్‌నగర్ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మిగిలిన గురుకులాలకు టెండర్లు పూర్తయినప్పటికీ నిధుల్లేక పనులు ప్రారంభంకాలేదు. ఈసారి బడ్జెట్లో రూ.8 వేల కోట్లు, 2027-28లో మరో రూ.5 వేల కోట్లు ఇస్తేనే నిర్మాణం సాకారమవుతుంది.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విధించిన గడువు ఇప్పటికే ముగిసింది. మొత్తం 79 గురుకులాల్లో తొలి విడతగా 3, రెండో విడతలో 11, మూడో విడతలో 64 నిర్మించాలని భావిస్తున్నది. ప్రస్తుతం తొలివిడదలో చేపట్టిన స్కూళ్లు మాత్రమే కాస్త పురోగతిలో ఉన్నాయి. రెండో విడత వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి, మూడో విడత వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్‌కు మంజూరు చేసిన గురుకులం నిర్మాణ పనులు ఇంకా పట్టాలెక్కలేదు.

01