డిండి, జనవరి 17 : కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిండి ఆర్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం పడమటితండాకు చెందిన పాండునాయక్ తన కూతురికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చేందుకు డిండి ఆర్ఐ శ్యామ్‌నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. మొదట రూ.5 వేలు ఇస్తానని, మిగతావి తర్వాత ఇస్తానని పాండునాయక్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో శ్యామ్‌నాయక్ శుక్రవారం హైదరాబాద్ హస్తినాపురంలోని తన నివాసంలో పాండునాయక్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో శ్యామ్‌నాయక్ సస్పెండ్ అయ్యాడు. ఆర్ఐ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు.