హైదరాబాద్, సెప్టెంబర్14(నమస్తే తెలంగాణ): గతేడాది డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు, జూన్ 2, 2014 తర్వాత మరణించిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో శనివారం సమావేశమయ్యారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు వినోద్ నేతృత్వంలోని కమిటీ నివేదించిన ఐదు అంశాలపై చర్చించారు.