బాసర, జూన్ 15 : నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గోదావరి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాదం నెలకొన్నది. బాసర గోదావరి వద్ద స్నానాలు ఆచరిస్తుండగా ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మలక్‌పేట్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌కు చెందిన రాజస్థానీలు దాదాపు 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రైలులో బాసరకు వచ్చారు.
పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి వద్ద గల పుష్కరఘాట్‌కు వెళ్లారు. బోటులో గోదావరి మధ్యలో తేలిన ఇసుక మేట దగ్గరికి వెళ్లి అక్కడే స్నానాలు ఆచరిస్తుండగా కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌కు చెందిన రాకేశ్ (20), మదన్ (18), భరత్ (16), మలక్‌పేట్ డివిజన్లోని శాలివాహననగర్‌కు చెందిన కిరాణావ్యాపారి ప్రవీణ్ తమ్ముడు రితిక్ (22), అతని సమీప బంధువు వినోద్ (19) ప్రమాదవశాత్తు నీట మునిగారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు కేకలు వేయగా.. బోటు నడిపే ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.
బయటకు తీసి హుటాహుటిన అంబులెన్సులో భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యులు వారికి ముందుగా సీపీఆర్ చేసినా స్పందించక పోవడంతో ఐదుగురు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐ మల్లేశ్ దవాఖానకు చేరుకుని ఘటనకు గల కారణాలను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేశారు.
గోదావరిలో మునిగి చనిపోయిన ఐదుగురు యువకుల్లో రాకేశ్, మదన్, భరత్ సొంత అన్నదమ్ములు. వినోద్ సమీప బంధువు కాగా మలక్‌పేట్‌కు చెందిన రితిక్ వీరి మిత్రుడు. ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఇలా ప్రమాదంలో మరణించడంతో తల్లి కన్నీరుమున్నీరైంది.
బాసర క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. గోదావరిలో తక్కువగా ఉండటంతో మధ్యలో ఇసుక మేటలు తేలాయి. సాధారణంగా భక్తులు పుష్కర ఘాట్ వద్దే స్నానాలు ఆచరిస్తారు. నీటి మట్టం తక్కువగా ఉండటంతో కొందరు భక్తులు ఇసుక తేలిన ప్రాంతానికి వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఇసుక తేలిన ప్రాంతం చుట్టుపక్కల కొంత మేర లోతట్టు ప్రాంతం ఉంటుంది. ఈత సరదాతో లోపలికి వెళ్లి స్నానం ఆచరిస్తూ ప్రమాదవశాత్తు మునిగి పోతున్నారు. బోటు యజమానులు వారిని అక్కడికి తీసుకువెళ్లకుండా ఉంటే ఐదుగురి ప్రాణాలు పోయేవి కావని పలువురు భక్తులు అంటున్నారు.
గోదావరి ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కన్పిస్తున్నది. ఇక్కడ ఎలాంటి సూచిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయకపోవడం, బోటులో వెళ్లే ప్రయాణికులకు లైవ్‌జాకెట్‌లు ఇవ్వక పోవడం, ఘాట్ల వద్ద పలు శాఖల అధికార సిబ్బంది, యంత్రాంగం లేకపోవడం, భక్తులకు అపాయం గురించి హెచ్చరించే విధంగా మైకు సెట్లు లేక పోవడం, గోదావరి పుష్కరఘాట్లకు కొద్ది దూరం మేర ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.