నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల సమయంలో బీజేపీ విడుదల చేసే వాగ్దానాల మ్యానిఫెస్టేలు ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు..’ అన్న చందంగా ఉంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు రాగానే ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం, ఆ తరువాత వారికి మొండిచేయి చూపడం కమలం పార్టీకి పరిపాటిగా మారిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆ పార్టీ విడుదల చేసిన ప్రణాళిక కూడా అదేవిధంగా ఉన్నదని విమర్శిస్తున్నారు. 500 రోజుల్లో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్లో బీజేపీ గెలిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తామని వాగ్దానం చేసి.. మూడున్నరేండ్లు గడిచినా అతీగతీ లేదని విమర్శిస్తున్నారు.
బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం
గత లోక్సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్లో ప్రచారానికి వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రాజ్నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, రామ్ మాధవ్ తదితరులు హామీల మీద హామీలు గుప్పించారు. వాటిలో పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఒకటి. కాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఒక అడుగు ముందుకేసి పసుపుబోర్డు ఏర్పాటుపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తానని ప్రకటించారు. ఒకవేళ హామీని నిలబెట్టుకోకపోతే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పసుపు బోర్డు ఆలోచనే తమకు లేదని ప్రకటించింది. ఎంపీగా గెలిచిన అరవింద్ ఇప్పుడు పదవిని అనుభవిస్తూ ఇచ్చిన హామీని అటకెక్కించారు.
హాస్యాస్పదంగా మునుగోడు మ్యానిఫెస్టో
ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు బతుకీడ్చలేక తీవ్రంగా సతమతమవుతున్న వేళ మునుగోడులో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను రాష్ట్ర ప్రజలు ఈసడించుకుంటున్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీయే అయితే పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీని నమ్మొద్దు..
బీజేపీని రైతులెవ్వరూ నమ్మొద్దు. తడిబట్టతో పసుపు రైతుల గొంతు కోశారు. రైతుల ఓట్లను వేసుకొని పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టిండ్రు. గెలిస్తే పసుపు బోర్డు తెస్తామని చెప్పిన వాళ్లు మూడున్నరేండ్లు దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? మునుగోడులో మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొనడం మాకే సిగ్గనిపిస్తున్నది.
– బాలరాజు, పసుపు రైతు
హామీలిచ్చిన బీజేపోళ్లు కనిపిస్తలేరు..
ఎన్నికలప్పుడు పసుపు రైతులకు మాయ మాటలు చెప్పిన బీజేపోళ్లు ఇప్పుడు సూద్దామన్న కనిపిస్తలేరు. పసుపు బోర్డు, కనీస మద్దతు ధర ఇస్తామన్నరు. ఏదీ దిక్కు లేదు. బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ రాజీనామా చేయకుండా తిరుగుతున్నడు. బీజేపీని నమ్మితే నిలువునా ముంచుతరు. ఆ పార్టీని నమ్మొద్దని మునుగోడు ప్రజలను కోరుకుంటున్నా. – పాలెపు గంగారెడ్డి, పసుపు రైతు