హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా కట్టంగూర్ రోడ్డులో పానగల్లుకు మూడుకిలోమీటర్ల దూరంలోని దండంపల్లిలో నాలుగో శతాబ్దినాటి మహిషాసురమర్ధిని విగ్రహం బయల్పడింది. స్థానిక లెక్చరర్ టంగుటూరి సైదులు ఇచ్చిన సమాచారంతో సోమవారం పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు. ఇది విష్ణుకుండిన కాలం, క్రీ.శ 4 లేదా 5 శతాబ్దాల నాటిదని చెప్పారు. స్థానిక రైతులు రోడ్డు పక్కనే కాలువ తీస్తుండగా బయటపడిన విగ్రహాన్ని, పక్కనే ఉన్న వినాయక విగ్రహం ముందుంచారని తెలిపారు. అక్కడ దొరికిన ఇటుక రాతి ముక్కలు, విగ్రహ పరిమాణాన్ని పరిశీలించి ఇది విష్ణుకుండిన కాలానికి చెందినది నిర్ధారించామని నల్లగొండ చరిత్ర కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు డీ సూర్యకుమార్ చెప్పారు. బాసరలోనూ ఇదే రకమైన అమ్మవారి విగ్రహం ఒక గుండుకు చెక్కి ఉన్నదని పేర్కొన్నారు. ఈ శిల్పం తెలంగాణ శిల్ప చరిత్రకు చక్కటి సాక్ష్యమని ఆయన వెల్లడించారు.