Overseas Vidya Nidhi | విద్యార్థులు పేదరికం కారణంగా విదేశీ విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కీమ్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని అటకెక్కించింది. దరఖాస్తుల స్వీకరిస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదు. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య అడ్మిషన్ల కాలాన్ని ఫాల్ సీజన్ అంటారు. గత ఫాల్ సీజన్ పోయి మళ్లీ ఫాల్ సీజన్ వచ్చినా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇంకా మెరుగైన పథకం తీసుకొస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ఆశ చూపుతూ దాటవేస్తున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా మళ్లీ ఈ ఫాల్ సీజన్‌కు ప్రభుత్వం అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.
పేదింటి బీసీ బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులు చదువుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా జనవరిలో (స్పింగ్ సీజన్) 150 మందిని, ఆగస్టులో (ఫాల్ సీజన్) 150 మంది బీసీ విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేసింది. వీసా చార్జీలు, ప్రయాణ ఖర్చులకు రూ.50వేలు ఇచ్చింది. మొత్తం సీట్లలో 30 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ) విద్యార్థులకు కేటాయించింది. బీసీ ఓవర్సీస్ పథకం కింద 2023 ఫాల్ సీజన్‌కు దరఖాస్తులను స్వీకరించగా, దాదాపు 2665 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జనవరిలోనే పూర్తయింది. కానీ ప్రభుత్వం అర్హుల జాబితా ప్రకటించలేదు. మళ్లీ స్పింగ్ సీజన్ కోసం ఫిబ్రవరి, మార్చిలో బీసీ సంక్షేమశాఖ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తంగా 1119దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులందరికీ గత నెలలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించినా అర్హుల జాబితాను ప్రకటించలేదు. ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ సర్కారు ఇవ్వలేదు. ఇప్పటికే 3784 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, మళ్లీ ఫాల్ సీజన్ కోసం బీసీ సంక్షేమశాఖ దరఖాస్తులను స్వీకరించగా, 1200కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. ఇవికాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, మైనారిటి విద్యార్థులకు ఇచ్చే సీఎం ఓవర్సీస్, బ్రాహ్మణ విద్యార్థులకు ఇచ్చిన వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్లను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలో మార్గదర్శకాల పేరిట సర్కారు చెలగాటమాడుతుంటే తల్లిదండ్రులు మాత్రం ఆర్థిక సంకటంలో కూరుకుపోతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మార్గదర్శకాలను మార్చుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్ప తీసుకొస్తామంటూ అసలు పథకాన్నే ఏడాదిగా పక్కనపెట్టింది. ప్రభుత్వ స్కాలర్షిప్ వస్తుందనే నమ్మకంతో కొందరు అప్పులు చేసి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లారు. ప్ర భుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.