హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు విదేశీ విద్యానిధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ రాక తీవ్ర భయాందోలన చెందుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యి ఏడు నెలలు గడుస్తున్నా నిధులు రాని దుస్థితి నెలకొన్నది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విద్యార్థులను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు తీవ్ర అవస్థలకు గురువుతున్నారు.
ఎంపిక చేసి వదిలేశారు..
నిరుపేద విద్యార్థులు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి, ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్, మైనారిటీల కోసం సీఎం ఓవర్సీస్, బ్రాహ్మణ విద్యార్థుల కోసం వివేకానంద ఓవర్సీస్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయని దుస్థితి నెలకొన్నది. ఓవర్సీస్ పథకం కింద గత రెండున్నరేండ్లలో ప్రభుత్వం మొత్తం 4,944 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వారికి రూ.20లక్షల చొప్పున ఆర్థిక సాయం, వన్‌టైమ్ ప్రయాణఖర్చులు కలిపి రూ.607 కోట్లు అవసరమని నిర్ణయించింది. వివిధ కారణాలతో మరో 520 మంది విద్యార్థులకు సంబంధించి రూ.53 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నిధులు విడుదల చేయని స్థితి నెలకొన్నది. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించలేదు. ఎంపిక చేసి తమను వదిలేసిందని అభ్యర్థులు వాపోతున్నారు. బకాయిలన్నీ విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు గత అక్టోబర్‌లో వెల్లడించారు. దీంతో దాదాపు రూ.80 కోట్లు మాత్రమే విడుదల చేయగా, ఆ తరువాత ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాలు సైతం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప నిధులు వచ్చింది లేదు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన..
వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించని, అకడమిక్ మార్కులకు 60 శాతం, జీమ్యాట్/జీఆర్ఈ 20శాతం, టోఫెల్, ఐఎల్స్, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి విదేశీ విద్యానిధి కింద విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. నిబంధనల మేరకు మెరిట్ విద్యార్థులు 100 శాతం స్కాలర్షిప్ వస్తుందనే ధీమాతో విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారు. ప్రస్తుతం విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే దశకు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికే ఉన్నవి ఖర్చుకాగా, అప్పులు తెచ్చిన తల్లిదండ్రులు తదుపరి ఫీజులు ఎలా చెల్లించాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు సైతం దొరుకని స్థితి నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విదేశీ విద్యానిధి విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.