Epic | యువ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎపిక్’. ‘బేబీ’ వంటి ఘన విజయం తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటించడంతో సినిమాపై మొదటి నుంచే యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే అదే సమయంలో ట్రైలర్లో కనిపించిన కొన్ని రొమాంటిక్, ముద్దు సన్నివేశాలపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకులను వేదికపైకి ఆహ్వానించిన నాగవంశీ.. ట్రైలర్లో కనిపించిన రొమాంటిక్ సన్నివేశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. కథలో భాగంగా సినిమాలో ముద్దు సన్నివేశం కనిపించినంత మాత్రాన దాన్ని ‘అడల్ట్ ఫిల్మ్’ గా ముద్ర వేయడం సరికాదని నాగవంశీ స్పష్టం చేశారు. సినిమాను పూర్తిగా చూసిన తర్వాతే దాని గురించి మాట్లాడాలని సూచించారు. ‘ఎపిక్’ అనేది కేవలం రొమాంటిక్ సన్నివేశాల చుట్టూ తిరిగే సినిమా కాదని.. ఇది నేటి తరం యువత ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కథతో రూపొందిన చిత్రమని ఆయన చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ‘ఎపిక్’ కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూసి ఆస్వాదించగలిగే ప్రేమకథా చిత్రం అని నాగవంశీ తెలిపారు. సినిమాలోని రొమాన్స్ కథలో భాగంగానే ఉంటుందని, దానిని మాత్రమే ఆధారంగా చేసుకుని సినిమాపై ఒక అభిప్రాయానికి రావద్దని అన్నారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలను కమర్షియల్ ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశామని ఆయన వివరించారు. యూత్‌కు నచ్చే రొమాంటిక్ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు కూడా సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా రన్‌టైమ్ గురించి కూడా నాగవంశీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఎపిక్’ మొత్తం 2 గంటల 20 నిమిషాల నిడివితో ఉంటుందని తెలిపారు.అందులో దాదాపు గంటా 40 నిమిషాల పాటు కథ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పాత్రల చుట్టూనే తిరుగుతుందని వెల్లడించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ థియేటర్లలోకి రానుండటంతో ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.