హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సాగునీటిపారుదల శాఖలోని ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) కమిటీ ఈ సీజన్లో రూ.48.53 కోట్లతో దాదాపు 66 పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఆయా ప్రతిపాదనలకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కమిటీ ఆమోదం తెలిపింది. మూసీ ప్రాజెక్ట్ ఎడమగట్టు, సోలిపేట(వీ), సూర్యాపేటలో నాన్ ఓవర్‌ఫ్లో సెక్షన్ మరమ్మతులకు రూ.76.10 లక్షలు మంజూరు చేసింది. కాకతీయ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలపై క్రాస్ రెగ్యులేటరీలు/ఓటీల మరమ్మతుల కోసం రూ.184.90 లక్షలు, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద 21వ మేజర్ ఆఫ్ టేక్ స్లూయిస్ అత్యవసర మరమ్మతుల కోసం రూ.64.75 లక్షలు, ఏన్కూరు మండలం ఎర్రబోడుతండా వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.65.10 లక్షలు మంజూరు చేసింది. ఆయా పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు ఆదేశాలు జారీచేశారు. వీటితోపాటు ఎస్సారెస్పీ ఎర్త్‌డ్యామ్ అప్ స్ట్రీమ్ రివెట్మెంట్ మరమ్మతులకు రూ.1,567.70 లక్షలు, కోయిల్‌సాగర్ నాగిరెడ్డిపల్లి పంపింగ్ స్టేషన్ పనులకు రూ.1,474.90 లక్షలు, ఎస్సారెస్పీ వరద కాలువపై వేంపల్లి సమీపంలో సూపర్ పాసే జ్ నిర్మాణం మరమ్మతులకు రూ.129.50 లక్షలతో ప్రభుత్వానికి ఓఅండ్ఎం కమిటీ ప్రతిపాదనలు పంపింది.