హైదరాబాద్, నవంబర్ 17 ( నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్/కార్వాన్: సౌదీ అరేబియాలో (Saudi Bus Accident) మాటలకందని తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఆధ్యాత్మిక యాత్రకు (Umrah Tour) వెళ్లిన 45 మంది హైదరాబాదీలు (Hyderabad) అగ్నికి ఆహుతయ్యారు. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు మక్కా నుంచి మదీనాకు 46 మందితో వెళ్తున్న బస్సు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ వద్ద ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. బస్సు ఢీకొన్న వేగానికి ఆయిల్ ట్యాంకర్ నుంచి ఇంధనం భారీగా లీకై, వేగంగా పేలుడుకు దారితీసిందని సౌదీ అధికారులు అంచనా వేశారు. క్షణాల్లోనే పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో అందరూ అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరగడంతో బస్సు నుంచి బయటపడే అవకాశం లేకుండాపోయింది. మొత్తం 46 మందిలో 45 మంది అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో అబ్దుల్ షోయబ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాలను సౌదీ అధికారులు స్థానిక దవాఖానలకు తరలించారు. అబ్దుల్ షోయబ్ స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లోని విద్యానగర్, టప్పాచబుత్రా, మొఘల్నగర్తోపాటు వివిధ ప్రాంతాలకు చెందినవారిగా తెలిసింది.
ఒకే కుటుంబం నుంచి 18 మంది
ప్రమాదంలో మరణించిన 45 మందిలో విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మంది ఉన్నారు. నజీరుద్దీన్ భార్యాపిల్లలు, మనుమలు, మనుమరాళ్లతో మక్కా వెళ్లాడు. నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ యాత్రకు రావడం వీలుకాక ఆగిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో అతడు ఒక్కడే మిగిలాడు. బహదూర్‌పురాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్టు సమాచారం. సౌదీ ప్రమాదంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ నెల 9న హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు 54 మంది వివిధ ఏజెన్సీల ద్వారా బయల్దేరారని చెప్పారు. ప్రణాళిక ప్రకారం యాత్ర నవంబర్ 23 వరకు ఉందని తెలిపారు. మక్కాను సందర్శించుకున్న తర్వాత యాత్రికుల్లో నలుగురు మక్కాలోనే ఉండిపోయారని, మరో నలుగురు కారులో మదీనా వెళ్లారని వివరించారు. మిగిలిన 46 మంది బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ యువకుడు అబ్దుల్ షోయబ్ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. బస్సులో డ్రైవర్ పక్కనే కూర్చున్న షోయబ్.. ప్రమాదం జరిగిన వెంటనే కిందికి దూకినట్టు సమాచారం. డ్రైవర్ కూడా గాయాలతో బయటపడ్డాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. మరోవైపు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 46 మంది హైదరాబాదీలతోపాటు ఇతరులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. పలువురు తీవ్ర గాయాలతో దవాఖానలలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ప్రమాద స్థలికి హుటాహుటిన చేరుకున్న సౌదీ అరేబియా అత్యవసర బృందాలు, స్థానిక అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కచ్చితంగా ఎంతమంది మరణించారు, వారి వివరాలను సౌదీ అధికారులు వెల్లడించాల్సి ఉన్నది. ఘోర రోడ్డు ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్‌ను అప్రమత్తం చేయగా కాన్సులేట్ హెల్ప్హైన్ను ఏర్పాటు చేసింది.

సంతాపాలు.. సహాయ చర్యలు
సౌదీ బస్సు ప్రమాద ఘటనలో యాత్రికుల సజీవ దహనంపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సౌదీ సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అధికారులు తెలిపారు. ప్రమాదం వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందానని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల వివరాలను సేకరించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు.
హజ్ యాత్రికుల మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన హజ్ యాత్రికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి బాధితులకు భరోసానివ్వాలని విజ్ఞప్తిచేశారు. బాధిత కుటుంబాలకు మెరుగైన పరిహారమిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు. యాత్రికుల మృతదేహాలను స్వదేశానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు తగిన చొరవచూపాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు పార్టీపరంగా అండగా ఉంటామని చెప్పారు.
హైదరాబాదీల మరణం దురదృష్టకరం: కేటీఆర్
హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు మృత్యువాత పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వారే ఎక్కువ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకొని సహాయ చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు మెరుగైన పరిహారమిచ్చి అండగా నిలువాలని విజ్ఞప్తిచేశారు. బస్సు దుర్ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
