హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన బేసిన్ అవతలికి కృష్ణా జలాలను మళ్లిస్తున్నదని, ఫలితంగానే బేసిన్లో నీటికొరత ఏర్పడుతున్నదని తెలంగాణ సర్కారు పేర్కొన్నది. ట్రిబ్యునల్ కేటాయింపులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతూ, ఆయకట్టును ప్రతిపాదిస్తున్నదని తెలిపింది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రి బ్యునల్‌కు తెలంగాణ నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో శుక్రవారం సైతం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ రాష్ట్రం తన తుది వాదనలను వినిపించింది. బేసిన్ అవతలికి కృష్ణా జలాల మళ్లింపు, ఆర్డీఎస్, పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల కేటాయింపు తదితర అంశాలపై ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ప్రస్తావించారు.
కృష్ణా బేసిన్లో తీవ్రమైన నీటి లోటు ఉన్న సంవత్సరాల్లో కూడా ఏపీ తెలుగుగంగా ప్రాజెక్టు పేరిట 40 టీఎంసీలను బేసిన్ అవతలి ప్రాంతాలకు మళ్లించిందని వివరించారు. కేంద్రం 2022లో జారీచేసిన గెజిట్ ప్రకారం షెడ్యూల్-11లోని ప్రాజెక్టులకు ఆమోదం ఉన్నదంటూ ఏపీ చేస్తున్న వాదనలను ఖండించారు. ట్రిబ్యునళ్లు ఎలాంటి కేటాయింపులు ఏపీకి చేయలేదని, మిగిలిన నీటిని ఉపయోగించుకునే స్వేచ్ఛను మాత్రమే ఉమ్మడి ఏపీకి ఇచ్చిందని తెలిపారు. ఆ మిగులు నీటి ఆధారిత ప్రాజెక్టుల కింద 16.3 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించడమేగాక, దానిని 26.3 లక్షలకు విస్తరించిందని, ట్రిబ్యునల్ నీటి కేటాయింపు లేకుండానే ఏపీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని వివరించారు. బేసిన్ అవతలికి జలాలను మళ్లించడం వల్ల పడవాటి జల ప్రవాహాలు కూడా అందుబాటులో ఉండటం లేదని వెల్లడించారు.
బయటి బేసిన్ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ అవుట్లెట్లపై నిర్దిష్ట పరిమితులను విధించి నియంత్రించాలని, అవార్డు నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకునేలా కేఆర్ఎంబీకి మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. కృష్ణాకు గోదావరి జలాల మళ్లింపు వల్ల కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో ఎకువ వాటా కోసం పట్టుబడుతున్నాయని, ఏపీ ఎక్కువ మొత్తంలో జలాలను కృష్ణా బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలించడమే ఇందుకు కారణమని తెలిపారు. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్రకు 35 టీఎంసీలు పంచారని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను సాగర్ ఎగువన మాత్రమే, ఇన్బేసిన్లోనే వినియోగించుకోవాల్సి ఉన్నదని తెలిపారు.
కానీ, ఏపీ మాత్రం ఆ 45 టీఎంసీలు తనకే దక్కుతాయని, ఆ జలాలను బయటి బేసిన్‌కు జలాలను మళ్లించే ప్రాజెక్టులకు కేటాయించాలని కోరుతున్నదని, ఆ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. 45 టీఎంసీలను ఏపీకి కేటాయించవద్దని కోరా రు. ఇదిలా ఉంటే 45 టీఎంసీల్లో 30 టీఎంసీలను 1982లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేటాయించిందని, అందుకు సంబంధించిన డీపీఆర్‌ను సైతం సీడబ్ల్యూసీకి సమర్పించిందని గుర్తుచేశారు. మిగిలిన 15 టీఎంసీలను సైతం ఇన్బేసిన్లో తాగునీటి అవసరాలకే కేటాయించాలని రాష్ట్రస్థాయి సలహా కమిటీ 2013లో సిఫారసు చేసిందని వివరించారు. కానీ, రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు మాత్రం మిగులు ఆధారిత ప్రాజెక్టులకు కేటాయించాలని ఏపీ వాదిస్తున్నదని గుర్తుచేశారు. ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ 15.9 టీఎంసీలు కేటాయించినా, కేవలం 5.4 టీఎంసీలు అందుతున్నాయని, తూములను మూసివేయకపోవడమే అందుకు కారణమని వాదించారు.
ముగిసిన తెలంగాణ వాదనలు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 సెక్ష న్ 89 ప్రకారం ఇరు తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల వారీగా మాత్రమే నీటిని కేటాయించాలని గతంలో కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్ష న్-3 ప్రకారం ట్రిబ్యునల్‌కు విచారణ చేసే అధికారం కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వం సుదీర్ఘ పోరాటం చేసింది. దీంతో కేంద్రం సెక్ష న్-3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ -2కి మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన ట్రిబ్యునల్-1 కేటాయించిన 811 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని, అదేవిధంగా గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం బ్రిజేశ్కుమా ర్ ట్రిబ్యునల్-2 విచారణ ప్రారంభించింది. ఇరు రాష్ర్టాల నుంచి స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)లను స్వీకరించింది. విచారణ అంశాల జాబితాను కూడా ట్రిబ్యునల్ ఖరారు చేసి ఈ ఏడాది జనవరిలో విచారణ ప్రారంభించింది. అందులోభాగంగా ట్రిబ్యునల్ ఎదుట ప్రారంభమైన తెలంగాణ వాదనలు శుక్రవారంతో ముగిశాయి. తదుపరి ఏపీ తన వాదనలను వినిపించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణ సెప్టెంబర్ 23, 24, 25 తేదీలకు చైర్మన్ వాయిదా వేశారు.