ఖైరతాబాద్, జూలై 7: బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించకుంటే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని సర్పంచ్‌లు, ఎంపీటీసీల సంఘాలు హెచ్చరించాయి. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించి విస్మరించిందని మండిపడ్డారు. కులగణన తర్వాత కూడా బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పేర్కొనడం మోసం చేయడమేనని దుయ్యబట్టారు. చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ఈ నెల 10న జరిగే క్యాబినెట్ సమావేశంలో తమ డిమాండ్‌పై చర్చించాలని కోరారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్, నాయకులు పాల్గొన్నారు.