హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణన కోసం డిమాండ్ చేస్తూ గాంధీ దవాఖానలో 8వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు సిద్దేశ్వర్, బీసీయూత్ అధ్యక్షుడు సంజయ్‌ను ఆదివారం ఆయన పరామర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కులగణన చేసి రిజర్వేషన్లను పెంచడానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు.
వీటిని పట్టించుకోకపోవడమంటే బీసీల వ్యతిరేక చర్యేనని మండిపడ్డారు. బీసీ నేతలు 8 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బీసీల పట్ల వివక్ష కనిపిస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి, బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ప్రకటించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానంపై జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశం, బీసీ నాయకులు రవియాదవ్, బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు వారిని పరామర్శించి మద్దతు తెలిపారు.