ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. ‘బీసీ రిజర్వేషన్లు – బహుజన రాజ్యాధికారం’ పేరిట పూలే, అంబేద్కర్ అధ్యయన వేదిక అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన సదస్సుల్లో రాజారాం మాట్లాడారు. మండల్ కమిషన్ వరకు బీసీలకు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని విమర్శించారు.
కులగణన చేసి దేశాన్ని ఎక్స్‌రే తీస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ మాట మీద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకమాట, అసెంబ్లీ ఎన్నికల తరువాత మరొకమాట మాట్లాడుతూ బీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. 9వ షెడ్యూల్ చేర్చిన తర్వాతే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. తక్షణమే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలంతా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని రాజారాంయాదవ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జస్టిస్ చంద్రకుమార్, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.