హైదరాబాద్, మార్చి 30 (నమస్తేతెలంగాణ) : దేశవ్యాప్తంగా కులగణన జరిపి, 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో చట్టరూపంలోకి తేవాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ, రాష్ట్ర నాయకులను ఎంబీభవన్లో కలిసి మద్దతు కోరింది.
ఏప్రిల్ 2న ఢిల్లీలో జరగనున్న మహాధర్నాకు సీపీఎం మద్దతిస్తున్నట్టు జాన్వెస్లీ తెలిపారు. తక్షణమే కేంద్రప్రభుత్వం ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్ ద్వంద్వ వైఖరితో మాట్లాడుతుండటాన్ని బలహీన వర్గాల ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటంలో కులగణన అనేది అత్యంత అవసరమని, ఇలాంటి అంశాలపై ఉద్యమిస్తున్న సంఘాలు, పార్టీలకు సీపీఎం పూర్తి మద్దతుగా నిలుస్తున్నదని జాన్వెస్లీ స్పష్టంచేశారు.