(నూర శ్రీనివాస్/హైదరాబాద్, నమస్తే తెలంగాణ): బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తమ న్యాయమైన వాటా సాధన కోసం పోరాటాలు చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను నిజం చేసేందుకు అవసమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగబద్దంగా, న్యాయస్థానాల తీర్పులకు నిలబడి ఉండేలా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా అమలు చేయవచ్చో జస్టిస్ ఈశ్వరయ్య సూచనలు చేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా అనేక అంశాలపై రాష్ట్రంలో ఆసక్తికరమైన, ఉత్కంఠ చర్చసాగుతున్న తరుణంలో సుదీర్ఘ కాలంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వం వెల్లడించిన కులగణనపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలు 42% రిజర్వేషన్లు సాధించుకోవడం సాధ్యమేనా?
జస్టిస్ ఈశ్వరయ్య: కులగణన విషయంలో వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, అనుమానాలను పారదర్శకంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ దిశగా ఏం చేస్తే సందేహాలు తీరుతాయో ఆ మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి. 42% రిజర్వేషన్లు సాధించుకోవడం బీసీల ముందున్న సవాల్. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. చిత్తశుద్ధిని చాటుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన చట్టాల ఆధారంగా రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. తమిళనాడులో 1989 నుంచే 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల్ కమిషన్ అనంతరం అప్పటివరకు లేని ఓబీసీ రిజర్వేషన్లు 27% జాతీయ స్థాయిలో 1993 నుంచి అనుభంలోకి రాలేదా?
ప్రజా ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు పెంచుతూ ఒకవేళ చట్టం చేసినా అది న్యాయస్థానంలో నిలవని వాతావరణం ఉన్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదెంతవరకు నిజం?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 నిబంధన (4) ప్రకారం, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆర్టికల్ 15 నిబంధన (5) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రగతి, వికాసాలకు రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసే అధికారం ఉన్నది. అధికరణ 30 నిబంధన (1) మైనారిటీ విద్యాసంస్థలు మినహా ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ విద్యాసంస్థలన్నంటి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆర్టికల్ 16(4) ప్రకారం, రాష్ట్రంలో ఏదైనా వెనుకబడిన తరగతికి రాష్ట్ర సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిథ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, ఆ వెనకబడిన తరగతి కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రత్యేక ఏర్పాటు చేసే అధికారమూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ (6), 243 టీ (6) ప్రకారం, వెనుకబడిన తరగతి పౌరుల కోసం పంచాయతీల్లో, పంచాయతీ హోదాల్లో రిజర్వేషన్లు, మునిసిపాలిటీల్లో, మునిసిపాలిటీ హోదాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ఏ (3) ప్రకారం, ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం, చట్టం ద్వారా, తన సొంత ప్రయోజనాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితా తయారుచేయవచ్చు, నిర్వహించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 343 ఏ (1)(2) కింద రూపొందించి, నిర్వహిస్తున్న సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాకు భిన్నమైన ఎంట్రీలు రాష్ట్ర జాబితాలో ఉండవచ్చును. ఈ నేపథ్యంలో నేను మొదటి నుంచి చెప్తున్న సాంకేతిక, న్యాయపరమైన అంశాల ఛట్రంలో ఉండే విధంగా చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది.
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ప్రభుత్వం అసెంబ్లీలో పేర్కొనడం వల్ల అవి మతపరమైన రిజర్వేషన్లుగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం చట్టం తెచ్చినా అది కోర్టులో నిలవదు అన్న వాదన ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి?
హిందూ బీసీలు అంటే అందులో సిక్కు బీసీలు, బౌద్ద బీసీలు, ముస్లిం బీసీలు అందరూ బీసీలే. అంటే విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులే. అవగాహనలేమితో మతాన్ని జోడించి చూస్తున్నారు కానీ, విద్య, సామాజికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వం వేర్వేరుగా చూపినా ఓబీసీ జనాభా 56% ఉంటుంది. అట్లా చూసినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమేమీ కాదు. కోర్టు పరిధిలో నిలిచేలా చట్టం చేయాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఆ మేరకు ఒత్తిడి తేవాల్సింది ప్రజాపోరాటాలే. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు ఏకోన్ముఖమై చట్టపరిధిలో నిలిచేలా ప్రభుత్వంతో చట్టం చేయించుకునేలా న్యాయబద్ధంగా, తర్కానికిపోకుండా శాస్త్రీయంగా రిజర్వేషన్లు సాధించుకునేలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాలి.
జనాభాలో సగానికి కన్నా ఎక్కువ ఉన్న బీసీలు ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో ఉద్యమిస్తున్న తరుణంలో బీసీలు 42 శాతానికే ఎందుకు పరిమితం కావాలి?
‘మేమెంతో మా కంత’ అనేది సహజ న్యాయం. ఇప్పటిదాకా ఉన్న బీసీ రిజర్వేషన్లు 27% ఉన్నాయి. వాటిని 42 శాతానికి పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుతున్నాం. 42% వాటా అన్నది అక్కడ పుట్టింది. ఈ నేపథ్యంలోనే దానిని నిలబెట్టుకోవాలని ప్రతిపాదిస్తున్నాం. 2011 జనాభా లెక్కలు, ఆయా ప్రభుత్వాలు రూపొందించిన చట్ట పరిధిలో సర్వే నిర్వహించిన సంస్థలు శాస్త్రీయంగా వెల్లడించిన జనాభా గణాంకాలను చూసినా, బీసీల పర్సంటేజ్ పరంగా చూసినా ఇప్పుడు బీసీలు కోరుతున్నది 42 శాతమే. రాజ్యాంగం ప్రసాదించిన సూత్రాలు, చట్ట పరిధిలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ బీసీ సమాజం ముక్తకంఠంతో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక వారికి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో వారి జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలి. ఆ లెక్కన చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాపులేషన్ 85% నుంచి 90% ఉంటుంది. అయితే, ఇక్కడ మొత్తం జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్లు కావాలని కోరడం లేదు. కోరుతున్నది 42శాతమే అన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రస్తుతం బీసీలకు ఉన్న 29% రిజర్వేషన్లను 42% పెంపు కోసం మీరు ముసాయిదా రూపొందించారని చెప్తున్నారు. అది నిజమేనా? నిజమే అయితే దాని కూర్పును వివరిస్తారా?
ఆయా సందర్భాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, జారీచేసిన మార్గదర్శకాలకు లోబడి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ (కామారెడ్డి డిక్లరేషన్), ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పరిగణనలోకి తీసుకొని ఒక ముసాయిదాను రూపొందించాం. దాని ప్రకారం ప్రస్తుతం బీసీల్లో ఉన్న ఐదు గ్రూపులకు (వాటిల్లోని కులాలకు) 29% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. వాటిని 42 శాతానికి పెంచుతూ ముసాయిదా రూపొందించాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగిన నేపథ్యంలో వారి రిజర్వేషన్లు పెరగాలి. ఈ మేరకు ముసాయిదా రూపొందించాం. అది ఇలా ఉన్నది. ప్రస్తుతం బీసీ ఏ గ్రూప్ 7%, బీసీ-బీ 10%, బీసీ-సీ 1%, బీసీ-డీ 7%, బీసీ-ఇ 4% మొత్తంగా 29% బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మేము బీసీ-ఏకు 11%, బీసీ-బీ 15%, బీసీ-సీ 1%, బీసీడీ 11%, బీసీ-ఇ 4%, ఎస్సీల్కు 17.5%, ఎస్టీలకు 10% చొప్పున మొత్తం 69.5% రిజర్వేషన్లు ప్రతిపాదించాం.
మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 69.5 శాతానికి ప్రతిపాదించారు. ఇది సాధ్యమేనా?
ఎందుకు సాధ్యం కాదు. ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా పెరిగింది కాబట్టి ఆ మేరకు పెరగాల్సిందే. అది ఆ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇందాక చెప్పినట్టు న్యాయస్థానాల తీర్పులు, రాజ్యాంగం వెనుకబడిన వర్గాలకు ప్రసాదించిన హక్కులు, వాగ్దానాలను అమలు చేయాలని కోరుతున్నాం. ఎలా ఎలా చేయవచ్చో చెప్తున్నాం. ప్రతిపాదిస్తున్నాం.
రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు మొత్తం రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటొద్దని చెప్తున్న నేపథ్యంలో మీ ప్రతిపాదనల అమలు ఎలా సాధ్యం?
చట్టసభలకు ప్రజలు సర్వాధికారాలు ఇచ్చారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఆ ప్రజాభీష్టం మేరకు ఏ చట్టాలు అయినా రూపొందించుకోవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 31సీ ప్రకారం చట్టం చేస్తే, అటువంటి చట్టాలను 31బీ ప్రకారం (లోగడ కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నా సరే) కొట్టివేయడానికి వీళ్లేదు. ఇంద్రసహానీ కేసులో పేర్కొన్న తీర్పు అదే. రిజర్వేషన్ల పెంపు కోరుతూ చట్టం చేసి, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలి. అందుకు అవసరమైన కార్యరంగాన్ని రూపొందించుకోవాలి. ఇదేం బ్రహ్మపదార్థం కాదు. 1989 నుంచి తమిళనాడులో అమలవుతున్నదే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం తేవాలి. రాజ్యాంగ సవరణకు కేంద్రానికి సిఫారసు చేసి ఊరుకుంటే సరిపోదు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవి మొక్కుబడిగా చేస్తే కుదరదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి చేత ఆమో దం వేయించాలి. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ ఈ రెండు పార్టీలు గట్టిగా పూనిక వహిస్తే ఈ రిజర్వేషన్ల సాధన పెద్ద విషయం కాదు. ఆ రెండు పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ప్రజలూ ఆ మేరకు సహకరించాలి. ఈ ప్రక్రియ అంతా కావడానికి సంవత్సరాలు అక్కర్లేదు. అవన్నీ అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఎవరు కలిసివస్తారు? ఎవరు కావాలని కాలయాపన చేస్తారు? బయటికి ఒకలా మాట్లాడాలి. లోపల ఒకలా ఎవరు ఉంటారు అన్నది తెలిసిపోతుంది. ఎవరైతే చిత్తశుద్ధితో, ఆత్మశుద్ధితో బీసీలకు సహకరించరో వారు బీసీలకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క.
జస్టిస్ ఈశ్వరయ్య ప్రతిపాదిత ముసాయిదా చట్టం ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులకు చెంది పౌరులకు తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, తెలంగాణ రాష్ట్ర సర్వీసు ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు, అలాగే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో రిజర్వేషన్లు, మునిసిపాలిటీల చట్టం ప్రకారం మునిసిపాలిటీల్లో రిజర్వేషన్లు, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం ప్రకారం మునిసిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్లు కల్పించే చట్టం 2025.
చట్టం పేరు ప్రభావ పరిధి: ఇది మొత్తం తెలంగాణ రాష్ర్టానికి వర్తిస్తుంది.
నిర్వచనం: వెనుకబడిన తరగతుల పౌరులు అంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సముదాయం లేదా సముదాయాలు, రాష్ట్ర సర్వీసుల్లో తగినంత ప్రాతినిధ్యం లేని సముదాయాలు, స్థానిక సంస్థల్లో తగినంత ప్రాతినిధ్యం పొందని సముదాయాలు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీ నోటిఫైడ్ సముదాయాలకు, వెనుకబడిన తరగతులకు మధ్య హేతుబద్ద, న్యాయబద్ద రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీ కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య వెనుకబాటుస్థాయి రీత్యా, వారికి రిజర్వేషన్ల కేటాయింపు ప్రతిపాదన. విద్యా సంస్థ అంటే, రాష్ట్ర ప్రభత్వం నిర్వహించే లేదా రాష్ట్ర నిధుల నుంచి ఆర్థిక సహాయం పొందే లేదా చట్టపరంగా స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విశ్వవిద్యాలయ కళాశాల లేదా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల లేదా ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన లేదా ఆమోదించబడిన డిగ్రీ, డిప్లామా లేదా ఇతర అకడమిక్ సర్టిఫికెట్లు ఇచ్చే శిక్షణా కేంద్రం లేదా సంస్థ ఏదైనా విశ్వవిద్యాలయం లేదా అధికారిక సంస్థ ద్వారా స్థాపించబడిన ప్రభుత్వ ఆమోదం పొందిన విద్యాలయం.