Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఈ ఏడాది భారీగా నేరాలు పెరిగాయి. 2023తో పోలిస్తే 2024లో 41 శాతం నేరాలు పెరిగినట్టు వార్షిక నివేదిక వెల్లడించింది. నగర పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన 2024-వార్షిక నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సిటీ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి బంజారాహిల్స్‌లోని కమాండ్, కంట్రోల్ సెంటర్లో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ 2023 చివరలో ఎన్నికలు పూర్తయి, 2024 మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో ఈసీ ఆదేశాల మేరకు అధికారుల బదిలీలు జరిగాయని చెప్పారు.
జిల్లాల నుంచి అధికారులు రావడం, వారికి సిటీ పోలీసింగ్‌పై అంతగా పట్టులేకపోవడంతో ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొనేందుకు కొంత సమయం పట్టిందని తెలిపారు. నిరుడు 25,488 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 35,944 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సైబర్ నేరాలు భారీ స్థాయిలో పెరిగాయని, ఈ ఏడాది 4,042 కేసులు నమోదు కాగా సుమారు రూ.296 కోట్లను సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి కొట్టేశారని తెలిపారు.
నేరాల్లో శిక్షల శాతం ఈ ఏడాది 42 శాతం నమోదైందని, నిరుడుకంటే పెరుగుదల ఉన్నదని చెప్పారు. సీసీఎస్‌లో ఈ ఏడాది 248 కేసులు నమోదు కాగా వీటిలో రూ.1,036 కోట్ల విలువైన నష్టం ప్రజలకు జరిగిందని వివరించారు. ట్రాఫిక్ పరిధిలో ఈ ఏడాది 48,81,352 చలాన్లు వేశామని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేయడంతో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య నిరుడు 327 ఉంటే, ఈ ఏడాది 215కు తగ్గిందని వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, ఏసీబీకి పట్టుబడ్డ 30 మందిపై వేటు పడిందని తెలిపారు. సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, ఆయా జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.
సంధ్య థియేటర్లో తొక్కిసలాటపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై సీపీ స్పందిస్తూ ఈ విషయం న్యాయస్థానంలో ఉన్నదని తాము ఎక్కువగా దీనిపై ఏమీ చెప్పలేమన్నారు. సీసీ కెమెరాలు, సోషల్‌మీడియా, మెయిన్ మీడియాలో వచ్చిన వీడియోలతో పాటు ఘటనకు ముందు వెనుక జరిగిన పరిణామాలపై దాదాపు 10 వేల కెమెరాల నుంచి పరిశీలించి 10 నిమిషాల నిడివి కలిగిన వీడియోను రూపొందించామని చెప్పారు. దాన్ని మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇది చూసిన వాళ్ల విజ్ఞతకే వదిలేస్తామని, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. సినిమా చూస్తున్న నటుడు అల్లు అర్జున్‌కు తొక్కిసలాట గురించి చెప్పారా? అని అడిగిన మరో ప్రశ్నకు తాము విషయం చెప్పామని తెలిపారు.
ఈ విషయంపై చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ మాట్లాడుతూ తొక్కిసలాట గురించి అల్లు అర్జున్‌కు చెప్పేందుకు వెళ్తుంటే ఆయన మేనేజర్ సంతోష్ అతని వద్దకు వెళ్లనీయలేదని, ఆ తర్వాత తానే వారిని తోసేస్తూ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి తొక్కిసలాట జరిగిందని, అక్కడ ఒక మహిళ మృతి చెందిందని, బాబు సీరియస్‌గా ఉన్నాడని చెప్పానని వివరించారు. సినిమా చూసి వెళ్లిపోతానని అల్లు అర్జున్ చెప్పినట్టు తెలిపారు. ఈ విషయాన్ని కింద ఉన్న డీసీపీకి వివరించడంతో ఆయన వచ్చి అల్లు అర్జున్‌కు వివరించి, 10 నిమిషాల్లో అక్కడి నుంచి ఆయనను పంపించారని వివరించారు.
చిక్కడపల్లి సీఐ రాజునాయక్ మాట్లాడుతూ రెండు గంటల ముందే సినీ నటుడు అల్లు అర్జున్ను రావొద్దని చెప్పాలని థియేటర్ యాజమాన్యానికి చెప్పామని, అయినా భారీ ర్యాలీలో అక్కడకు వచ్చారని తెలిపారు. అర్జున్ రావడంతోనే భారీగా ప్రేక్షకులు గుమిగూడారని, చాలామంది కింద బాల్కనీలోకి చొచ్చుకెళ్లారని, అక్కడి నుంచి పై బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్ను కలిసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కింద బాల్కనీలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడును అపస్మారక స్థితిలోకి పోవడంతో బయటకు తీసుకొచ్చి సిబ్బంది, ఎస్సై మౌనికతో కలిసి సీపీఆర్ చేశామని వివరించారు.