హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా పార్టీని వీడిన 41 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వివిధ రకాలైన 24 ఆయుధాలను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. శుక్రవా రం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులను మీడియాకు చూపించారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలకవ్యక్తి కుమ్రం భీం ఆసిఫాబాద్-మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ అలియాస్ ప్రశాంత్, మంచిర్యాలకు చెందిన పార్టీ సభ్యుడు కనకారపు ప్రభంజన్ ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి 24 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులే. వీరిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)బెటాలియన్‌కు చెందిన 11 మంది ఉన్నారు. ఆ కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యు డు, ప్లాటూన్-3 కమాండర్ మడకం మంగా తన టీమ్‌తో కలిసి లొంగిపోయాడు. వారితోపాటు తెలంగాణ పార్టీ క్యాడర్లో ఉన్న సీఆర్సీకి చెందిన ఐదుగురు కూడా లొంగిపోయారు. వారిలో ముఖ్యుడు కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు, కమాండర్ కొర్సా లచ్చూ అలియాస్ ప్రశాంత్ ఉన్నాడు. ఇతను 21 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు.
మిగిలింది 54 మంది మాత్రమే..
2025లో మొత్తం 509 మంది మావోయిస్టు లొంగిపోయినట్టు డీజీపీ తెలిపారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 57 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్టు వివరించారు. వరస లొంగుబాట్లతో తెలంగాణకు చెందిన మొత్తం 54 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్టు చెప్పారు.
కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌పై విచారణ కొనసాగుతోంది..
ఇటీవల కోదాడలో చోటుచేసుకున్న కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌పై ‘నమస్తే తెలంగాణ’ డీజీపీని ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. ‘కర్ల రాజేశ్ మృతిపై విచారణ జరుగుతున్నదని, ఈ కేసులో పోలీసులది తప్పని తేలితే క్షమించేది లేదని, అందరిపై చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ తెలిపారు. గత నెలలో చేయని తప్పునకు ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా పోలీసులు అక్రమంగా తమ కస్టడీలోకి తీసుకొని, ఓ రాజకీయ కుట్రకోణంలో రాజేశ్‌ను చిత్రహింసలు పెట్టినట్టు అతని తల్లి లలిత డీజీపీకి ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ; ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన
కొత్తగూడెం ప్రగతి మైదాన్, డిసెంబర్ 19 : మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పు ల్లో ఒక మావోయిస్టు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి అడవు ల్లో డీఆర్జీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో శుక్రవారం మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జ వాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోగా జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు మృతదేహంతోపాటు ఆయుధ, వస్తు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.