హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసేవారిని చట్టపరంగా శిక్షించాలని, వారికి 41 సీఆర్పీసీ కింద బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. నిందితులను అరెస్టుచేసి రిమాండ్కు తరలించకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల.. బాధితులు, సాక్షులపై నిందితులు కేసులను రాజీకోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో చట్టంస్ఫూర్తి నీరుగారి, బాధితులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వీరేంద్ర కుమార్.. దీనిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, కుర్సం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్, సెక్రటరీ పాండదాస్ ఉన్నారు.