Telangana | హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్‌కు రూ. 6 వేల లంచం సమర్పించుకుంటే తప్ప బుకింగ్ కావటం లేదు. లోడింగ్ పేరుతో మరో రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఈ మొత్తాన్ని లారీ యజమానులు వినియోగదారులపై మోపుతున్నారు.
లంచాన్ని నిలువరించాలని కోరుతూ సోమవారం లారీ యజమానులు టీజీఎండీసీ కార్యాలయంలో ఆందోళన నిర్వహించి చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎండీసీ ద్వారా ప్రతి నెల సగటున వర్షాకాలంలో 20 లక్షల మెట్రిక్ టన్నులు, మిగిలిన కాలాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఇసుక విక్రయాలు జరుగుతాయి. బల్క్‌గా ఇసుకు తెచ్చుకునే బడా బిల్డర్లు తప్ప చిన్నాచితకా బిల్డర్లు, సొంతంగా ఇండ్లు నిర్మించుకునేవారు సహజంగానే సమీపంలోని ఇసుక లారీ అడ్డాల నుంచే ఇఇసుక లారీకి 6 వేల లంచం!
విక్రయిస్తుంటే, లారీ యజమానులు బుకింగ్ చేసుకొని స్టాక్‌యార్డుల నుంచి ఇంటికి చేర్చేందుకు ప్రస్తుతం టన్నుకు రూ.2,500చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీలో సుమారు 35 నుంచి 45 టన్నుల ఇసుకను తరలిస్తూ వినియోగదారుల నుంచి 35 టన్నులకు రూ.87,500, 45 టన్నులకు రూ.1,12,500 చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే, ఒక్కో టన్ను ఇసుకపై లారీ యజమానులు రూ.2,000కుపైగా వినియోగదారులనుంచి వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.1,000 రవాణా ఖర్చులు పోగా, మిగిలిన రూ.1,000లో లారీ యజమానుల లాభాలు, అధికారుల అమ్యామ్యాలు ఉంటున్నాయి.
ప్రస్తుతం టీజీఎండీసీ ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లు కావటం లేదు. కొన్ని ఎంపిక చేసిన మీసేవ కేంద్రాల్లో ‘బాట్ సాఫ్ట్వేర్’ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే బుకింగ్ అవుతుందని లారీ యజమానులు చెప్తున్నారు. దీనికోసం ఒక్కో బుకింగ్‌కు రూ.5,000-6,000 అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు. బుకింగ్‌లో సమస్యల వెనుక టీజీఎండీసీ అధికారుల పాత్ర ఉన్నదన్న ఆరోపణలున్నాయి. స్టాక్‌యార్డ్‌ల వద్ద ఇసుకను లారీలో లోడింగ్ చేయాల్సిన బాధ్యత టీజీఎండీసీ నియమించిన కాంట్రాక్టరుదే అయినా.. ఇసుక లారీల వద్ద లోడింగ్ పేరుతో అక్రమంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు.
వర్షాకాలంలో ఇసుక తవ్వకంతోపాటు రవాణాలో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సహజంగానే ఇతర కాలాలతో పోల్చుకుంటే ఇసుక ధర టన్నుకు రూ.100 నుంచి రూ.200 ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలంలో సైతం ఇసుక ధర రూ.1,500 దాటలేదు. కానీ ఇప్పుడు ఏకంగా రూ.2,500 చేరుకోవటం గమనార్హం. టీజీఎండీసీ వద్ద ధర యథావిధిగా టన్నుకు రూ.450 మాత్రమే ఉన్నప్పటికీ ఇసుక లారీలపై అధికారుల వేధింపులు, లంచాల వసూళ్లు ఎక్కువైపోవటంతో ఇసుక ధర టన్నుకు రూ.1,000 వరకు పెంచక తప్పటం లేదని లారీ యజమానులే చెప్తున్నారు.
అలాగే, ఇసుక స్టాక్యార్డ్లకు వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయించాల్సిన టీజీఎండీసీ.. వాటిని పట్టించుకోవడంలేదు. దీనివల్ల లారీ యజమానులకు నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి.. ఆ భారాన్ని కూడా వినియోగదారులపైనే మోపుతున్నారు. ఇటీవల మావోయిస్టు వారోత్సవాల పేరుతో ఇసుక తరలింపును నిలిపివేశారు. దీంతో ఇసుకకు మరింత కొరత ఏర్పడింది. ఇలా రకరకాల కారణాలతో అధికారులే ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెరిగేందుకు దోహదపడుతున్నారు.
రాష్ట్రంలో 76 ఇసుక రీచ్‌లకుగాను ప్రస్తుతం 19 పనిచేస్తున్నాయి. ఎన్జీటీ కేసుల వల్ల కొన్ని నిలిచిపోగా, మరికొన్ని నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఇసుక తీయటం సాధ్యంకాక నిలిపివేశారు. మేడిగడ్డ బరాజ్ వద్ద ఇసుక తవ్వకాలకు టెండర్లు ఖరారైనప్పటికీ నదిలో వరద అధికంగా ఉండటంతో ఇసుక తవ్వకం ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతకు తోడు రీచ్‌లు మూతపడటంతో డిమాండ్‌కు తగ్గంత ఇసుక సరఫరా కావటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర ప్రాంతాల్లో స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో ఇసుక తవ్వకం, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు.