సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను డిసెంబరు 9 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐజీ దవాఖానను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్లో వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యా రంగానికి రూ. 21,500 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని, డిసెంబర్ 9నాటికి వాటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో పనిచేసే వైద్యులు సామాజిక బాధ్యత కింద ఏడాదికి నెల రోజుల చొప్పున సర్కార్ దవాఖానల్లో సేవలు అందించాలని కోరారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు వీటినే కాంగ్రెస్ ప్రారంభించనుంది.