మహబూబాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురిని పదోతరగతి విద్యార్థులు కాపాడారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోత్ భద్రూనాయక్, అతని భార్య అచ్చాలి, కూతురు సుమలత, మనుమడు దీక్షిత్‌తో కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో బంధువుల కందూరు పండుగకు కారులో వెళ్లారు. అక్కడ వేడుకను పూర్తిచేసుకొని తిరిగి టేకులపల్లికి బయలుదేరారు. అదే కార్యక్రమానికి వచ్చిన గుగులోత్ లలిత, ఆమె కుమారుడు సురేశ్ కూడా అదే కారు ఎక్కారు. ఈ క్రమంలో కారు కేసముద్రం సినిమా థియేటర్ సమీపానికి వచ్చే సరికి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
పక్కనే ఉన్న వివేకానంద ప్రైవేటు పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు సిద్ధు, రంజిత్ పరుగెత్తుకెళ్లి తాడును బావి ఒడ్డుకున్న కనికి కట్టి దాని సాయంతో బావిలోకి దూకారు. అప్పటికే మునిగిపోతున్న కారు అద్దాలు పగులకొట్టి, డ్రైవర్ సీటులో ఉన్న బిక్కుతోపాటు ఆ పక్కన ఉన్న సుమలత, అతని కుమారుడు దీక్షితను బయటకు లాగి ఒడ్డుకు చేర్చారు. ఇంతలో స్థానికులు వచ్చి వెనుక సీటులో ఉన్న గుగులోత్ లలిత(45)ను బయటకు తీయగా అప్పటికే మృతి చెం దింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అచ్చాలి (35)ని మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీయగా భద్రూనాయక్ (39), సురేశ్ (15) మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురిని కాపాడిన విద్యార్థులు సిద్ధు, రంజిత్‌ను పలువురు అభినందించారు. కారు అద్దాలను పగులగొట్టే క్రమంలో వారి చేతులకు గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
లిఫ్ట్ అడగకపోతే బతికేవాళ్లేమో..
మహబూబాబాద్ పట్టణంలోని భవానీనగర్ తండాకు చెందిన గుగులోత్ లలిత మహబూబాబాద్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో అటెండర్‌గా పనిచేస్తుంది. ఈమె కుమారుడు సురేశ్ 9వ తరగతి చదువుతున్నాడు. బ్యాంకుకు సెలవు పెట్టి కొడుకుతో కలిసి అన్నారానికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో కారు లిఫ్ట్ అడిగి తమ ప్రాణాలను కోల్పోయారు.