మునిపల్లి, ఆగస్టు 6: ముంబైయి నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న 4 కిలోల 840 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్టు సంగారెడ్డి జిల్లా డీటీఎఫ్ సీఐ శంకర్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివారులో ముంబైయి జాతీయ రహదారిపై డెక్కన్ టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌లో బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడు చంద్రష్ను అదుపులోకి తీసుకున్నట్టు డీటీఎఫ్ సీఐ శంకర్ తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు ముంబైయి జాతీయ రహదారిపై కంకోల్ డెక్కన్ టోల్‌ప్లాజా వద్ద క్రమం తప్పకుండా వాహనాలు తనిఖీలు చేస్తున్నామని, తనిఖీల్లో భాగంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో సోదాలు చేశామని, చంద్రష్ అనే వ్యక్తి బ్యాగుల్లో బంగారం కనిపించిందని వివరించారు. బంగారంతోపాటు చంద్రష్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి పోలీసులకు అప్పగించినట్టు సీఐ చెప్పారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3 కోట్ల 43 లక్షల 64 వేలు ఉంటుందని తెలిపారు.