హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘెష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఇప్పటి వరకు 4 ఫిర్యాదులు అందాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు గడువు నేటితో ముగియనున్నది. ఇప్పటివరకు 4 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మరోసారి జూన్ 7వ తేదీన రాష్ర్టానికి రానున్నారు. పది రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణను కొనసాగించనున్నారు. జస్టిస్ ఘోష్ ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ర్టానికి విచ్చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం విచారణ ప్రారంభిస్తామని చెప్పిన పీసీ ఘోష్ జూన్7న రాష్ర్టానికి వచ్చి దాదాపు 10 రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం.
కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్‌కు సంబంధించి ఇప్పటికే నోడల్ ఆఫీసర్‌గా ఇరిగేషన్‌శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే సాంకేతిక అంశాలపై సహాయం కోసం ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ తయారీ, ప్రాజెక్టు నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఓఅండ్ఎం తదితర విభాగాల వారీగా నిపుణులైన అధికారులను నియమించింది. మొత్తంగా ముగ్గురు ఈఈలు, ఆరుగురు డీఈఈలు, 12 మంది ఏఈఈలను కమిషన్‌కు ప్రభుత్వం కేటాయించింది.