Maoists | ములుగు, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు గత ఆరు రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. కేంద్ర పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తున్నది. ఈ ఆపరేషన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందిన పోలీస్ అధికారులతోపాటు కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తున్నాయి.
కర్రెగుట్ట ప్రాంతాల్లో భద్రతా బలగాలు హెలికాప్టర్ల సాయంతో అడవినంతా జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ల సాయంతో ఏజెన్సీ ప్రాంతాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్‌లో 3 రాష్ర్టాల పోలీస్ బలగాలు పాల్గొనంటున్నట్టు తెలిసింది.వీరికి 8 హెలికాప్టర్లతో ఆయుధాలు, భోజనం, నీళ్లు సరఫరా చేస్తున్నారు.
మావోయిస్టు కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్‌గా కూంబింగ్ జరుగుతున్నది. ఎదురు కాల్పులకు సంబంధించిన ప్రతి విషయాన్ని భద్రతా బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. గురువారం ఉదయం ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, శనివారం మృతి చెందిన 38 మందిని బీజాపూర్‌కు తరలించినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది.
కొత్తగూడెం ప్రగతి మైదాన్: దండకారణ్యంలో సెర్చింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ జవాన్.. మందుపాతర పేలి గాయపడ్డాడు. కర్రెగుట్టల్లో ఒకటైన గలంగ్ గుట్టపై శనివారం విధులు నిర్వర్తిస్తున్న బీజాపూర్ జిల్లా రిజర్వు గార్డ్స్ విభాగానికి చెందిన ఓ జవాన్.. మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు పెట్టాడు. దీంతో అది ఒక్కసారిగా పేలి సదరు జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి జవాన్లు అతనికి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.
హనుమకొండ చౌరస్తా: కర్రెగుట్టలో కాల్పులను వెంటనే నిలిపివేయాలని పౌర హకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హకుల సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని అన్నారు. ఈ కాల్పుల్లో ఆదివాసీలు బలవుతున్నారని, శ్మశానంలో చర్చలు జరపాలని కేంద్రం అనుకుంటున్నదని, పోరాటం చేస్తున్న వారితో శాంతి చర్చలు జరపాలని సూచించారు. మావోయిస్టు పార్టీ లేఖలు రాసినప్పటికీ కర్రెగుట్టను వేల మందితో ముట్టడించడం సరికాదని, యుద్ధం అపాలని అన్నారు. సమాజ కోరిక మేరకు కేంద్రం చర్చలకు ముందుకురావాలని కోరారు. భారత ప్రజలను, భారత సైన్యాలే చంపడం మంచి పరిణామం కాదని, గతంలో సుప్రీంకోర్టు కూడా తెలిపిందని గుర్తుచేశారు. సమావేశంలో గాదె ఇన్నయ్య, రవిచందర్, తిరుపతయ్య, ఎం వెంగళ్‌రెడ్డి, జనగం కుమారస్వామి, రమేశ్చందర్, శాంతి, ఎం గంగాధర్, రవీందర్, సుదర్శన్, కొడారి కుమారస్వామి, రామ, చంచు రాజేందర్, డాక్టర్ కృష్ణ, ఎం ప్రవీణ్‌కుమార్, మాదాసి సురేశ్, నున్న అప్పారావు, రమేశ్సుందర్, శ్రావణ్, మర్రి మహేశ్, క్రాంతి, అరసం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎం శంకర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ : కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులపై కూంబింగ్ నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదేపదే ప్రతిపాదిస్తున్నప్పటికీ కూంబింగ్ నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణహోమం చేయడం సరైన చర్య కాదని హితవు పలికారు. అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు.