హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని బహుజనులంతా ఏకం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి ఉత్సవాలను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కల్లుగీత కార్మిక, గౌడ, బీసీ సంఘాల ఆధ్వర్యంలోనూ పాపన్న జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయాచోట్ల పాపన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన రాజ్యం కోసం పాపన్న చేసిన పోరాటాన్ని నేతలు స్మరించుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్న జయంతి సభను ఘనంగా నిర్వహించారు.
కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ కే స్వామిగౌడ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాంచారు. ఈ సందర్భంగా సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ సర్వార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
పాపన్న విగ్రహం చూడగానే కర్తవ్యం గుర్తుకురావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. పాపన్నగౌడ్ సాహసానికి మారు పేరు అని కొనియాడారు. బీసీలంతా ఏకం కావాలని కోరారు. సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్‌కుమార్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, గణేశ్‌చారి, అంబాల నారాయణగౌడ్, ఎంవీ రమణ, అంబాల నారాయణగౌడ్, గాయకులు రామలింగం, ఎపూరు సోమన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో నేతలు జకే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.