హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఆర్థిక శాఖ 363 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. మెడికల్ కాలేజీకి 117 పోస్టులు, కొడంగల్‌లోని ప్రభుత్వ దవాఖానకు 199 పోస్టులు, నర్సింగ్ కాలేజీకి 31 పోస్టులు, ఫిజియోథెరపి కాలేజీకి 16 పోస్టులు మంజూరు చేసింది.
మెడికల్ కాలేజీకి మంజూరు చేసిన పోస్టుల్లో 115 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో నర్సింగ్ ఆఫీసర్ల సంఘాలు మండిపడుతున్నాయి. స్టాఫ్ నర్సుల పోస్టులను నర్సింగ్ ఆఫీసర్లుగా మార్చుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసిందని చెప్తున్నారు. తమను స్టాఫ్ నర్సులుగా గుర్తిస్తున్నారో, నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తిస్తున్నారో స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ చర్య దాదాపు 13 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లను అవమానించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తర్వుల్లో తమ హోదాను మార్చాలని వారు కోరుతున్నారు.