హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 36 గుర్తులను ఎంపిచేసింది. వీటిలో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిజ్, రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయిస్తారు.
అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈ గుర్తులు సహాయ పడతాయని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ, ఇతర ప్రధాన పార్టీలకు రిజర్వు గుర్తులతోపాటు ఈ ఉచిత గుర్తులను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.