
రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రం కనికరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తున్నది. కరోనా కాలంలో ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయిన కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నది. ఏటా మే నెలలో ఇవ్వాల్సిన వస్ర్తోత్పత్తి ఆర్డర్లను ఈసారి నాలుగు నెలల ముందే ఇచ్చింది. రూ. 350 కోట్లతో కోటి చీరల ఉత్పత్తికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, 250 డిజైన్లతో ఆకర్షణీయమైన రంగుల్లో రూపొందిస్తున్నది. ఈనెల 22న ఉత్పత్తులు ప్రారంభించగా, నేతన్నకు 8 నెలలపాటు ఉపాధి దొరకనున్నది.
చీరల ఆర్డర్లతో చేతి నిండా పని..
వ్యవసాయం తర్వాత దేశంలోనే అతిపెద్దది వస్త్ర పరిశ్రమ. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత, మరమగ్గాల పరిశ్రమపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. తెలంగాణకే తలమానికంగా నిలిచిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. రైల్వేలో వినియోగించే బెడ్షీట్లు, సింగరేణి ఉద్యోగుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు చేయూత నివ్వాల్సిన కేంద్రం.. పట్టనట్టు వ్యవహరిస్తున్నది. కాగా బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్‌కు సంబంధించిన వస్త్ర ఉత్పత్తులతో రాష్ట్ర ప్రభు త్వం కార్మికులకు చేతి నిండా పనికల్పిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉపాధి కోల్పోకుండా ఆయన చేస్తున్న కృషి ని కార్మిక కుటుంబాలు కొనియాడుతున్నాయి. కార్మికుల విజ్ఞప్తి మేరకు ఏటా నాలుగు నెలల ముందే రూ.350 కోట్లతో కోటి చీరల ఆర్డర్లు ఇచ్చి తన పెద్ద మనుసును చాటుకున్నారు.