హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఈఎస్ఐసీ వైద్య కళాశాలల్లో 35% కార్మిక కుంటుంబాల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేసినట్టు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ వైద్యకళాశాల డీన్ శిరీశ్‌కుమార్ జీ చవాన్ తెలిపారు. దీని వల్ల దేశంలో అన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలల్లో కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ విద్యను చదువుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) దవాఖాన సేవలను విస్తృతం చేసినట్టు ఆయన తెలిపారు. ఏటా గణనీయంగా వైద్యసేవలు అందిస్తున్నామని, నిరుడు 72 లక్షల 69 వేల మందికి పైగా ఇన్‌పేషెంట్లకు వైద్య చికిత్సలు అందించినట్టు వివరించారు.
గురువారం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనితీరు, ఇక్కడ కార్మికులు, వారి కుటుంబాలకు అందుతున్న సేవలను అధ్యయనం చేసేందుకు జాతీయ మీడియా బృందం పర్యటించింది. దవాఖానలోని వివిధ విభాగాలు, ఇక్కడ అందుతున్న సేవలను బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మీడియా బృందానికి దవాఖానలో అందిస్తున్న సేవల వివరాలను శిరీశ్‌కుమార్ జీ చవాన్ వివరించారు. వైద్యవిద్యను అభ్యసిస్తున్న మహారాష్ట్ర, హర్యానాకు చెందిన కార్మికుల పిల్లలు మహేశ్, భూమికతో అధ్యయన బృందం సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాధిక, ఈఎస్ఐ దక్షిణ భారత ప్రాంత కమిషనర్ ఆశిథ్ ముళ్లక్, పీఐబీ అదనపు సంచాలకులు మనీశ్ గౌతమ్, వైద్యకళాశాల సిబ్బంది, పీఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు.