హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఎస్‌బీపాస్ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మున్సిపల్‌శాఖ మరోసారి క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. తాజాగా 33 మంది అధికారుల వేతనాల్లో కోత విధిస్తూ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నారు.
రెండు రోజుల క్రితం కూడా మరో ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులపై చర్యలు తీసుకొన్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొత్తం 56 మంది అధికారులపై మున్సిపల్‌శాఖ చర్యలు తీసుకోవడం గమనార్హం. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఇంటి అనుమతుల్లో అవినీతి, జాప్యం, నిర్లక్ష్యం తదితరాలకు తావు లేకుండా పారదర్శక విధానాలు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌బీపాస్ చట్టాన్ని తీసుకొచ్చింది.